తెలంగాణ

telangana

ETV Bharat / crime

హైదరాబాద్​లో గుప్పుమంటోన్న డ్రగ్స్​.. నిందితుల వేటలో పోలీసులు.. - Drugs gangs in Hyderabad

Drugs Cases in Hyderabad: మహానగరంలో డ్రగ్స్‌ ముఠాలు రెచ్చిపోతున్నాయి. చాపకింద నీరులా వ్యాపించి యువతను డ్రగ్స్​ రక్కసికి బానిసలను చేస్తున్నాయి. కొందరు ముఠా సభ్యులు యువతను నేరుగా గోవాకు తీసుకెళ్లి మత్తులో ముంచి తేలుస్తున్నారు. మరికొందరు బయటనుంచి కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారు. ఇక ఓ యువకుడైతే ఓ అడుగు ముందుకేసి.. ఏకంగా ఇంట్లోనే ల్యాబ్​ పెట్టేశాడు. అయితే.. డ్రగ్స్​ హైడోస్​తో​ ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి ఘటనతో ఉలిక్కిపడిన పోలీస్‌ యంత్రాంగం కట్టడి చర్యలపై దృష్టి పెట్టింది. ప్రత్యేకంగా ఏర్పాటైన నార్కొటిక్‌ విభాగం నిందితులను వెంటాడి వేటాడేందుకు రంగంలోకి దిగింది.

Police focus on Drugs Cases in Hyderabad
Police focus on Drugs Cases in Hyderabad

By

Published : Apr 1, 2022, 6:30 PM IST

Drugs Cases in Hyderabad: గోవా.. డ్రగ్స్‌కు తోవగా మారుతోంది. పక్కాగా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకుంటున్న ముఠాలు డ్రగ్స్‌ దందాను యధేచ్చగా కొనసాగిస్తున్నాయి. కొందరిని నేరుగా గోవాకు తీసుకెళ్లి మత్తులో ముంచి తేలుస్తున్నారు. అయితే.. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి మృతిచెందిన బీటెక్‌ విద్యార్థి కేసుతో అప్రమత్తమైన పోలీసులు.. డ్రగ్స్​ దందాలపై ఫోకస్​ పెట్టారు.

విద్యార్థి మృతితో అప్రమత్తం..: డ్రగ్స్​కు బానిసైన బీటెక్ విద్యార్థి మృతి చెందడం హైదరాబాద్​లో పెద్ద కలకలమే రేగింది. రెండ్రోజుల క్రితం నగరంలో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇందులో.. నల్లకుంట పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమ్ ఉపాధ్యాయ్​తో పాటు వాటిని వినియోగిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి విచారించగా.. అసలు విషయం బయటపడింది. వీళ్లంతా తరచూ గోవా వెళ్లి డ్రగ్స్​ సేవిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్​ పరిధిలో శ్రీరామ్, అతడి వద్ద డ్రగ్స్ వినియోగిస్తున్న దీపక్ కుమార్​ను అరెస్ట్ చేశారు.

ప్రధాని నిందితుని వేటలో..: ఈ మొత్తం వ్యవహారంలో లక్ష్మీపతి కీలక నిందితుడిగా భావిస్తున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పరారీలో ఉన్న లక్ష్మీపతి కోసం నార్కోటిక్స్ పోలీసులు 3 బృందాలుగా గాలిస్తున్నాయి. లక్ష్మీపతిపై ఉన్న పాత కేసుల వివరాలతో పాటు అతని నెట్ వర్క్, కాంటాక్ట్ లో ఉన్న విద్యార్థులపై దృష్టి సారించారు. గోవా నుంచి డ్రగ్స్, విశాఖ నుంచి హాష్ ఆయిల్ తెచ్చి లక్ష్మీపతి విక్రయిస్తున్నాడని గుర్తించారు. డ్రగ్స్ బాధితులను గుర్తించే పనిలో ఉన్న పోలీసులు.. గోవా వెళ్లి వచ్చే వాళ్లపైనా నిఘా పెట్టారు.

ఇంట్లోనే డ్రగ్స్​ ల్యాబ్​..: జూబ్లీహిల్స్‌లో మత్తు పదార్ధాలు తయారు చేసి విక్రయిస్తు పట్టుబడిన శ్రీరామ్‌, దీపక్​ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సూర్యాపేట్‌ జిల్లాకు చెందిన శ్రీరామ్‌ ఇంటినే ల్యాబ్‌గా మార్చి ఈ దందా కొనసాగిస్తున్నాడు. అంతర్జాలంలో డ్రగ్స్‌ తయారీపై వెతకటంతో పాటు హిమాలయాలు, రిషికేశ్‌ లాంటి ప్రాంతాలకు వెళ్లి... విదేశీ పర్యటకుల నుంచి డీఎంటీ తయారీ విధానాన్ని నేర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే తొలుత తనతో పాటు స్నేహితులపై ఈ డ్రగ్స్‌ పరీక్షించి... ఒక గ్రాముతో 20 మందికి మత్తు ఇవ్వచ్చని తెలుసుకున్నాడు. ఇక అప్పటి నుంచి దీన్నే వృత్తిగా మార్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

దంపతులే డ్రగ్​ డీలర్స్​..: ఇదిలా ఉండగా... మత్తు పదార్థాలకు ఉన్న డిమాండ్‌ను సొమ్ముచేసుకునేందుకు అరకు నుంచి గంజాయిని తీసుకువచ్చి.... హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఓ ఐటీ ఉద్యోగిని బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. నాచారంలోని ఓ సంస్థలో పనిచేస్తున్న మాన్సీ, ఆమె భర్త మదన్‌మనేకర్‌ కలిసి... రెండేళ్లుగా గంజాయి దందా సాగిస్తున్నారు. మార్చి 12న ఇద్దరు యువకులతో కలిసి ఈ దంపతులు గంజాయి విక్రయాలు జరుపుతుండగా.. దాడి చేసిన పోలీసులకు ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. మాన్సీ, ఆమె భర్త తప్పించుకున్నారు. పట్టుబడిన వారిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కొంపల్లి దంపతులను అరెస్టు చేశారు.

మొదటిసారి పంజాబ్​ నుంచి..: మరోవైపు.. కండ్లకోయ వద్ద ఉన్న దాబాలో నడిపిస్తున్న డ్రగ్స్​ దందా గుట్టురట్టయింది. పంజాబ్​ నుంచి డ్రగ్స్ తెప్పించుకుని ఇక్కడ అమ్ముతున్న దాబా యజమాని, అందులో పనిచేస్తున్న కార్మికుడు ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. 900 గ్రాముల మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి లక్షా నలభై వేలు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌ నుంచి డ్రగ్స్‌ సరఫరా కావటం ఇదే తొలిసారని పోలీసులు చెబుతున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details