మేడ్చల్ జిల్లా జీడిమెట్ల వినాయక్ నగర్‌లో ఈనెల 10న జరిగిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఝార్ఖండ్‌కుచెందిన రాజేశ్ వర్మ జీడిమెట్ల పరిధిలోని వినాయక్ నగర్‌లో ఐదేళ్లుగా నివాసముంటున్నాడు. అతని పక్క గదిలో యూపీకి చెందిన సంజిత్, రింకు దంపతులుంటున్నారు. ఆటో డ్రైవర్ అయిన సంజిత్ జులాయిగా తిరిగి అప్పులపాలయ్యాడు. ఈ సమయంలో రింకుకు దగ్గరైన రాజేశ్ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ ఇంటికి కావాల్సిన అన్ని ఖర్చులు తానే భరించాడు. కొన్నేళ్లుగా సంజిత్‌కు ఈ విషయం తెలిసినా డబ్బుల కోసం కథ నడిపించాడు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జార్ఖండ్‌కు చెందిన పూజ(21)అనే యువతిని పెళ్లి చేసుకున్న రాజేశ్ ఆమెనూ ఇదే ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి రింకుకు దూరంగా ఉండటంతో పాటు ఇంటి ఖర్చులకు డబ్బులివ్వడం ఆపేశాడు. పూజ రావడంతోనే తమకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని, ఇలాగే ఉంటే రాజేశ్ పూర్తిగా దూరమవుతాడని భావించిన దంపతులిద్దరూ పూజను హత్యచేసేందుకు పథకం రచించారు. ఈనెల 10న రాజేశ్ విధులకు వెళ్లిన సమయంలో నిద్రపోతున్న పూజపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు.