రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని అలంఖాన్‌గూడ శుభగృహ వెంచర్ ముందు ఈ నెల 11న దారుణ హత్యకు గురైన బోడ వెంకటయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు.
చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ పల్లి మండలం దొంతాన్ పల్లి గ్రామానికి చెందిన అశోక్, అతని చెల్లెలు అమృతల మధ్య కొంత కాలంగా రెండుఎకరాల పొలంపై భూవివాదం నడుస్తోంది. ఈ భూమి విషయమై ఎంతో కొంత డబ్బులు ఇస్తానని కేసు వేయొద్దని అశోక్ అమృతకు చెప్పగా.. దీనికి ఆమె ఒప్పుకోకుండా భూమిపై కేసు వేసింది.
దీనితో పగ పెంచుకున్న అశోక్.. అమృతను చంపాలని వరసకు బావ అయిన బోడ వెంకటయ్యతో 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.4లక్షలు తీసుకుని పని చేయకపోగా.. ఇంకో 50వేలు ఇవ్వమని బెదిరింపులకు దిగాడు. దీనితో ఈ హత్య ఒప్పందం బయటికి చెబుతాడేమోనని అశోక్ భయపడ్డాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.
అశోక్ దగ్గరికి పని కోసం వచ్చిన అతని వదిన కుమారుడు పవన్‌కు ఈ గొడవ గురించి తెలియగానే వెంకటయ్యను చంపుతానని.. తనకు రూ.10వేలు ఇవ్వాలని అశోక్‌తో అన్నాడు. సరే అని చెప్పిన అశోక్.. ఈ నెల 11వ తేది అర్ధరాత్రి రెండు గంటలకు మాట్లాడుకుందామని వెంకటయ్యకు ఫోన్ చేసి రమ్మన్నాడు. శుభగృహ వెంచర్ వద్దకు రాగానే అశోక్, బోడ వెంకటయ్య ఇద్దరు గొడవ పడుతుండగా వెనుక నుంచి వచ్చిన పవన్ వెంకటయ్య కళ్లలో కారం చల్లాడు. తర్వాత ఇద్దరూ కలిసి వెంకటయ్యను దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. అనంతరం తమ కారులో కంది వైపు పారిపోతూ.. రక్తపు మరకలు ఉన్న తమ దుస్తులను మార్గమధ్యలో దోభీపేట్ గ్రామ సమీపంలో చెట్ల పొదల్లో విసిరేసి పారిపోయారు.