తెలంగాణ

telangana

ETV Bharat / crime

BABY MURDER: పిల్లలు పుట్టలేదని పసివాడిని చంపేసింది.. - telangana varthalu

తల్లివి కాలేవని ఆడపడుచు అవమానించినందుకు.. కక్ష కట్టింది ఓ ఇల్లాలు. ఆ బాధ ఎలా ఉంటుందో ఆడపడుచుకు తెలియజెప్పాలనుకుంది. దీనికోసం తనలోని మృగాన్ని తట్టి లేపింది. ఆడపడుచు కుమారుడైన 2 నెలల పసికందును నీటి ట్యాంకులో పడేసి చంపేసింది. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లు ఇంట్లోకొచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో చిన్నారి అత్తను విచారించడంతో అసలు విషయం బయటపడింది.

పిల్లలు పుట్టలేదని పసివాడిని చంపేసింది..
పిల్లలు పుట్టలేదని పసివాడిని చంపేసింది..

By

Published : Jun 19, 2021, 3:58 PM IST

Updated : Jun 19, 2021, 5:39 PM IST

ప‌సికందును చంపేసింది అత్త, మేన‌మామే.. తేల్చిన పోలీసులు

అసూయ, ఈర్శ్య 2 నెలల పసికందు ప్రాణాలను తీశాయి. చిన్నారిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లికి తీరని శోకాన్ని మిగిల్చాయి. తనకు కలిగిన బాధ ఇతరులకు కలగాలన్న ద్వేషంతో ఓ మహిళ చేసిన దుశ్చర్య... రెండు కుటుంబాలను దుఃఖ సాగరంలో ముంచింది. పెళ్లైన 12 ఏళ్ల తర్వాత సంతానం కలగగా.. ఆ సంతోషం కొన్ని రోజులైనా నిలవక ముందే అత్త రూపంలోని ఈర్శ్య చిన్నారిని చిదిమేసింది. అప్పటి వరకు తల్లి ఒడిలో ఆదమరిచి నిద్రించిన చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండుతాయని కన్న తల్లి కలలో కూడా ఊహించలేదు. నీకు ఇక పిల్లలు పుట్టరని మరదలితో పరిహాసమాడినందుకు... దాన్ని మనసులో పెట్టుకొని తన మాతృత్వానికే ఎసరు పెడుతుందని గుర్తించలేకపోయింది. పిల్లలు లేని బాధ ఎలా ఉంటుందో తెలిసేలా చేయాలనుకున్న ఓ మహిళ తన ఆడపడుచు కుమారుడిని హత్య చేసింది. హైదరాబాద్ శివారు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అనాజ్‌పూర్‌లో పసికందు హత్యోదంతం వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది.

ఆడపడచు అవమానించిందని..

ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లికి చెందిన తిరుమలేశ్ గౌడ్‌కు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌కు చెందిన లతతో 12ఏళ్ల క్రితం వివాహం కాగా... 2 నెలల క్రితం ప్రసవం అయింది. లత తన బాబుతో కలిసి తల్లిగారింట్లోనే ఉంటుంది. లేకలేక బాబు పుట్టడంతో లత, ఆమె తల్లి ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్నారు. ఈ నెల రెండో వారంలో బారసాల చేసి బాబుకు ఉమామహేశ్వర్ అనే పేరు పెట్టారు. లత తమ్ముడు బాల్‌రాజుకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఆయన భార్య శ్వేత గర్భం దాల్చినప్పటికీ రెండు నెలల క్రితం గర్భస్రావమైంది. గర్భస్రావమైన తర్వాత శ్వేతను ఆమె ఆడపడుచు లత అవమానించింది. నీకు థైరాయిడ్ సమస్య ఉంది కాబట్టి... పిల్లలు పుట్టరని పరిహాసమాడింది. దీన్ని మనసులో పెట్టుకున్న శ్వేత.. ఎలాగైనా పిల్లాడిని హతమార్చి, తన కోపాన్ని చల్లార్చుకోవాలనుకుంది. అదును కోసం వేచి చూసింది. ఒకట్రెండు సార్లు పిల్లాడిని చంపేయడానికి ప్రయత్నించినప్పటికీ విఫలమైంది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున హత్యకు పథకం వేసింది. తల్లిపాలు తాగి గాఢనిద్రలోకి వెళ్లిన బాబును తెల్లవారుజామున 3.40నిమిషాల సమయంలో మిద్దెపైకి ఎత్తుకెళ్లి నీళ్ల ట్యాంకులో పడేసింది. బాబు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత కింది వచ్చి.. ఏమీ ఎరుగనట్లు గదిలోకి వెళ్లి నిద్రించింది.

తమదైన శైలిలో విచారించిన పోలీసులు

ఉదయం 5 గంటల సమయంలో తల్లి లతకి మెలకువ వచ్చి చూస్తే బాబు కనిపించలేదు. తమ్ముడి భార్య అయిన శ్వేత అప్పుడప్పుడు బాబును ఎత్తుకొంటుంది. శ్వేతనే తీసుకొని ఉండొచ్చని లత భావించింది. 6 గంటల సమయంలో నిద్రలేచిన లత.. బాబు కోసం శ్వేత గదికి వెళ్లింది. అక్కడ మరదలు ఒక్కతే కనిపించడంతో బాబు కోసం వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో కుటుంబసభ్యులందరూ చుట్టుపక్కల వెతికారు. చివరకు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి అంతా పరిశీలించగా.. నీటి ట్యాంకులో 2 నెలల బాబు విగతజీవిగా కనిపించాడు. కుటుంబసభ్యులు ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయలేదు. హత్య చేసిన శ్వేత.. పోలీసులకు విషయం తెలిస్తుందేమోనని భయపడింది. తనకు దగ్గరి వారు అనుకున్న వాళ్లతో విషయం చెప్పింది. ఆ విషయం కాస్త పోలీసులకు చేరింది. తమదైన శైలిలో విచారించగా శ్వేత తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది.

కుట్రతో రగిలిపోయిన శ్వేత ఆడపడుచు కుమారుడినే చంపి కటకటాలపాలైంది. ఆడపడుచూ ఆడిన పరిహాసాన్ని మనసులో పెట్టుకొని సమాజం దృష్టిలో హంతకురాలిగా మిగిలిపోయింది.

ఇదీ చదవండి: నీటి ట్యాంకులో చిన్నారి మృతదేహం.. మేనమామ, అత్తలే హంతకులా?

Last Updated : Jun 19, 2021, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details