తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆశ్రమాలే అడ్డాలు.. ఆతిథ్యం, భక్తి అతని అస్త్రాలు - chating in the name of orphanages

ఉజ్జయిని మహంకాళి..లక్ష్మీదేవీల పంచలోహ ప్రతిమలు బహుమతులుగా ఇవ్వడం. ఇళ్లు, ఉద్యోగాలు కావాలంటూ ఆశ్రయించిన బాధితులను ఖరీదైన హోటళ్లకు తీసుకెళ్లి ఆత్మీయ ఆతిథ్యమివ్వడం. వారు తేరుకునేలోపే మోసం చేసి అదృశ్యమవడం. ముఖ్యమంత్రి ఓఏస్డీ వ్యక్తిగత సహాయకుడినని చెప్పుకొంటూ పోలీసులకు పట్టుబడ్డ ఎ.సుధాకర్‌ మాయలివీ.

cheating, cm osd, cm osd cheating
మోసం, సీఎం ఓఎస్డీ, సీఎం ఓఎస్డీ చీటింగ్

By

Published : Apr 1, 2021, 6:50 AM IST

ముఖ్యమంత్రి ఓఏస్డీ వ్యక్తిగత సహాయకుడినని చెప్పుకుంటూ ప్రజలను, ప్రముఖులను మోసం చేస్తోన్న సుధాకర్.. నమ్మించి మోసం చేయాలంటే భక్తి, ఆతిథ్యాన్ని మించినవి లేవని తెలుసుకున్నాడు.‌ రెండేళ్ల నుంచి హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లో ప్రముఖ ఆలయాలు, ఆశ్రమాలకు వెళ్లి అక్కడే బాధితులను ఎంపిక చేసుకుని మరీ మోసాలకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. సుధాకర్‌ మాయాజాలంలో ఇద్దరు స్వామీజీలు చిక్కుకుని రూ.60 లక్షలు సమర్పించుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు..అతడి డాబూ దర్పం చూసి మోసపోయిన సికింద్రాబాద్‌లో ఉంటున్న ప్రధాన పార్టీ గల్లీ లీడర్‌ నామినేటెడ్‌ పోస్టు కోసం డబ్బులిచ్చేందుకు సిద్ధమయ్యాడంటే అతని మాట తీరు ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. నిందితుని అరెస్టు వార్త తెలుసుకున్న ఆయన ప్రస్తుతం హమ్మయ్యా! అని ఊపిరిపీల్చుకున్నాడట.

వీఐపీ ఇళ్లు ఇప్పిస్తానంటూ రూ.1.23 కోట్లు

కూకట్‌పల్లి-మియాపూర్‌ మార్గంలో ఉన్న ఓ ఆశ్రమానికి సుధాకర్‌ ఏడాది నుంచి తరచూ వెళ్లేవాడు. ఫార్చూనర్‌ కారు, అంగరక్షకులను చూసి స్వామీజీ అనుచరులు అతడికి ఎక్కువ మర్యాదలు చేసేవారు. కొన్ని నెలలకు ముందు ఆశ్రమానికి వెళ్లిన అతను అక్కడున్న 50 మంది భక్తులు సహా, స్వామీజీ అనుచరులకు మహంకాళి అమ్మవారి పంచలోహ ప్రతిమలను బహుమతులుగా ఇచ్చాడు. ఈ క్రమంలో ఒక బ్యాంకు మేనేజర్‌ భార్య పరిచయమైంది. ఆమెను అమ్మా అని పిలుస్తూ కొద్దిరోజుల్లోనే నమ్మకం సంపాదించుకున్నాడు. పేదలకు రెండు పడకలగదుల ఇళ్లు ఇప్పిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. తనకు తెలిసిన వారున్నారని ఆమె చెప్పగా, రూ.5 లక్షల చొప్పున ఇస్తే మియాపూర్‌లో ఇప్పిస్తానన్నాడు. మీకు, మీ స్నేహితులకు ప్రత్యేకంగా వీఐపీ ఇళ్లు ఇప్పిస్తానని నమ్మించడంతో ఐదు నెలల క్రితం ఆమె రూ.1.23 కోట్లు వసూలు చేసి ఇచ్చింది. సంక్రాంతిలోపు ఇళ్లు ఇప్పిస్తానని చెప్పిన సుధాకర్‌ తర్వాత అటువైపు వెళ్లలేదు.

ప్రభుత్వ స్థలం రాసిస్తానని నమ్మించి

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కొద్దిదూరంలో ఓ ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో ఇది ‘ప్రభుత్వానికి చెందిన భూమి’ అనే బోర్డు కూడా ఉంది. ఆ భూమిలో 600 చదరపు గజాల స్థలం ఇప్పిస్తానంటూ సుధాకర్‌ ఒక ప్రొఫెసర్‌ను మూడు నెలల క్రితం నమ్మించాడు. ఈ స్థలం తాలూకూ హక్కులు ప్రభుత్వానివేనని, ఎవరికైనా కేటాయించే అధికారం సీఎం కార్యాలయానికి ఉందంటూ నకిలీ ఉత్తర్వులు ఆ ప్రొఫెసర్‌కు చూపించాడు. రూ.33 లక్షలిస్తే మీ పేరు మీద రాయించే ఏర్పాట్లు చేస్తానన్నాడు. రూ.33 లక్షలు తీసుకున్న తర్వాత నోటరీ సంతకాలు చేయించి ప్రొఫెసర్‌ పేరుమీద స్థలాన్ని రాసిచ్చాడు. వీటి ఆధారంగా స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆయన వెళ్లారు. ప్రభుత్వ అధికారులు అడ్డుకోవడంతో మోసపోయానని గ్రహించిన ఆయన ఓయూ పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మూడు నెలల క్రితం సుధాకర్‌ పరిచయమయ్యాడని, అతని గుర్తింపు కార్డు, కారు, వ్యక్తిగత అంగరక్షకులను చూసి సీఎం ఓఎస్డీ వ్యక్తిగత సహాయకుడేనని నమ్మానంటూ పోలీసుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

ABOUT THE AUTHOR

...view details