తెలంగాణ

telangana

ETV Bharat / crime

యూట్యూబ్​లో చూసి నకిలీ కరెన్సీ ప్రింటింగ్.. అంతలోనే..!

fake currency notes printing: ఉపాధి కోసం నగరానికి వలసొచ్చాడు. బతుకుదెరువు కోసం ఓ మెకానిక్​ షెడ్డు పెట్టుకున్నాడు. కరోనా కాలం నష్టాలు తీసుకురావడంతో.. ఇలా కాకుండా సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. యూట్యూబ్​లో వీడియోలు చూసి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ పని ప్రారంభించి సక్సెస్​ కూడా అయ్యాడు. ఇలా 6 నెలలుగా దిగ్విజయంగా సాగుతున్న అతడి 'యూట్యూబ్​ ప్రయాణానికి' ఓ చిరు వ్యాపారి చెక్​ పెట్టాడు. అదెలాగంటే..?

fake currency notes printing
fake currency notes printing

By

Published : Sep 21, 2022, 10:46 AM IST

fake currency notes printing: నకిలీ నోట్లు ముద్రించి మార్కెట్​లో చలామణి చేస్తున్న అన్నాచెల్లెళ్ల బాగోతాన్ని గోపాలపురం పోలీసులు బట్టబయలు చేశారు. నకిలీ కరెన్సీతో సొమ్ము చేసుకుంటున్న నిందితుడిని అరెస్టు చేసి.. రిమాండ్​కు తరలించారు. అతడి వద్ద నుంచి రూ.3 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లతో పాటు ఓ ప్రింటర్, ల్యాప్​టాప్, ముద్రణ యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ చందనా దీప్తి వెల్లడించారు.

నిందితులు బండ్లగూడాజాగీర్​కు చెందిన రమేశ్​ బాబు, అతని చెల్లెలు రామేశ్వరిలుగా పోలీసులు గుర్తించారు. వీరి స్వస్థలం మహారాష్ట్రలోని పుణెగా తెలిపారు. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చిన రమేశ్​బాబు బండ్లగూడ జాగీర్‌ కాళీమందిర్‌ వద్ద మెకానిక్‌ షెడ్డు ప్రారంభించాడు. అతడి చెల్లెలు కె.రామేశ్వరి నగరంలోని ఓ కళాశాలలో వైద్యవిద్య కోర్సు చదువుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ రమేశ్​బాబు.. తేలికగా డబ్బు సంపాదించే మార్గం కోసం వెతికాడు. యూట్యూబ్‌లో చూసి నకిలీ కరెన్సీ తయారు చేసి సొమ్ము చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు.

అనుకున్నదే తడవుగా అన్నాచెల్లెలు ఇద్దరూ కలిసి కాళీ మందిర్ ప్రాంతంలోనే ఓ ఫ్లాట్​ అద్దెకు తీసుకుని నకిలీ రూ.100, 200, 500 నోట్ల తయారీ ప్రారంభించినట్లు విచారణలో వెల్లడైందని డీసీపీ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి దిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణల్లో చలామణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పండ్ల వ్యాపారికి నకిలీ రూ.200 నోటును ఇవ్వగా.. అనుమానంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయాలన్నీ వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. పరారీలో ఉన్న రామేశ్వరి పట్టుబడితే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని డీసీపీ చందనాదీప్తి తెలిపారు.

బంగారు ఆభరణాల కోసమే ఆ మహిళ హత్య..: ఈ కేసుతో పాటే రెండు రోజుల క్రితం తిరుమలగిరి పోలీస్​స్టేషన్ పరిధిలోని ఎల్ఐసీ కార్యాలయం పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో మృతి చెందిన దేవమ్మ అనే మహిళ కేసునూ ఛేదించినట్లు డీసీపీ పేర్కొన్నారు. కల్లు తాగే అలవాటున్న రాములు అనే వ్యక్తి.. దేవమ్మ వద్ద ఉన్న బంగారాన్ని అపహరించేందుకు కుట్ర పన్ని.. ఆమెపై దాడి చేయడంతో మృతి చెందినట్లు తెలిపారు. నిందితుడు రాములును అరెస్ట్ చేసి.. రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details