హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి టెలికాం (Gachibowli Theft Case) నగర్లో నివసించే గోవిందరావు ఇంట్లో కొన్ని నెలల కిందట ఓ వ్యక్తి పనిలో చేరాడు. కొంత కాలం పనిచేసిన తర్వాత.. తాను ఊరికి వెళ్తున్నానని, తిరిగి వచ్చేవరకు తమ బంధువులను పనిలో పెట్టుకోవాలని కోరాడు. గోవిందరావు సరే అనడంతో అలా అతని బంధువులు లక్ష్మణ్, పవిత్ర దంపతులు నాలుగు నెలలుగా ఆ ఇంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వారి వద్ద నమ్మకం సంపాదించారు. ఊరెళ్లి వస్తానని చెప్పిన మనిషి ఇంకా రాకపోవడంతో గోవిందరావు వీరినే కొనసాగించారు.
అదను చూసి
ఈ క్రమంలో గోవిందరావు.. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన నేపాల్ దంపతులు ఇంటి కిటీకీ తొలగించి లోపలికి ప్రవేశించారు. బెడ్రూమ్ తలుపు పగులగొట్టి లాకర్లోని రూ. 10 లక్షల నగదు, 110 తులాల బంగారంతో పరారయ్యారు. శ్రీశైలంలో ఉన్న గోవిందరావు.. లక్ష్మణ్‌కు ఫోన్ చేయడంతో అతని ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన యజమాని వెంటనే ఇంటికి చేరారు. ఇంట్లో వాచ్మెన్ కనపడకపోవడం, నగదు, బంగారం లేకపోవడంతో దొంగతనం(Gachibowli Theft Case) జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నమ్మకంగా ఇంట్లో పనిచేసిన వ్యక్తులు ఇలా చోరీకి పాల్పడతారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చోరీ తర్వాత ముఠా సభ్యులంతా సొత్తును సమంగా పంచుకుంటారు. బంగారు ఆభరణాలను ముక్కలుగా పగులగొడతారు. ఒక్కరు దొరికినా మిగిలిన వారు పట్టపడకుండా ఎవరి దారిన వాళ్లు నేపాల్‌కు చేరుకుంటారు. దొంగిలించిన సొత్తును చాలా తక్కువ ధరకే విక్రయిస్తారు. ఆ డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ దొంగలకు రెండు ఇళ్లుంటాయి. ఊరిలో ఒకటి, గుట్టలపై ఒకటి. పోలీసులు వచ్చినట్లు సమాచారం రాగానే గుట్టలపై ఉన్న ఇళ్లకు చేరుకుంటారు. అక్కడికి చేరుకోవాలంటే కనీసం 5 గంటల నుంచి 7 గంటల వరకు నడవాల్సి ఉంటుంది. పై నుంచి పోలీసుల రాకపోకలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండి అప్రమత్తవుతారు.