సరిగ్గా మూడు రోజుల క్రితం.. అంటే మే 1న అన్నమాట. ఆ రోజు ఆదివారం.. హైదరాబాద్ మూసాపేట్లో నివాసముంటున్న ఆవుల విజయ్‌కుమార్ భార్యకు.. నగలు అవసరం పడటంతో ఇంట్లో ఉన్న బీరువా తెరిచింది. ఎంతో భద్రంగా దాచుకున్న నగలు ఆమెకు కనిపించలేదు. కంగారు పడింది. బీరువా మొత్తం జల్లెడ పట్టింది. అయినా బంగారం కనిపించలేదు. ఆందోళన, భయం.. అన్ని కలిపి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎందుకంటే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 24.5 తులాల బంగారం మరి. వారం క్రితం చూసినప్పుడు నిక్షేపంగా ఉన్న బంగారం ఇప్పుడు మాయం కావటంతో ఇంట్లో వాళ్లంతా టెన్షన్ పడుతున్నారు. దాచిపెట్టే వీలున్న అన్నిదగ్గర్లా ఒకటికి రెండు సార్లు వెతుకుతున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. దొంగతనం జరిగిందా..? అని అనుమానం వ్యక్తం చేశారు. అలాంటి ఆనవాళ్లేమీ వాళ్లకు కనిపించలేదు. ఇంటికి వచ్చిన వాళ్లేవరైనా తీసుంటారా..? అని ఆలోచించారు. తెలిసినవాళ్లు ఎలా తీస్తారని సమాధానం చెప్పుకున్నారు. అయినా.. అంత బంగారం చూశాక తెలిసినవాళ్లేంటీ..? తెలియనివాళ్లేంటీ..? ఆశకు అవేవీ అడ్డురావని అంచనాకు వచ్చారు.
ఇందులో భాగంగా.. వారం రోజులుగా ఇంటికి ఎవరెవరు వచ్చారు..? అన్న అంశంపై ఆరాలు తీయటం మొదలుపెట్టారు. అయితే విజయ్‌కుమార్ దంపతులు బయటికి వెళ్లినప్పుడు తమ కుమార్తె మేఘన.. ఒంటరిగా ఇంట్లో ఉండేది. ఆ సమయంలో ఇంటికి ఎవరైనా వచ్చారా..? అని ఆమెను అడిగారు. మొదట ఎవరు రాలేదని చెప్పిన మేఘనను తల్లిదండ్రులు గట్టిగా ఆడిగారు. బయపడిపోయిన మేఘన.. ఒకటి రెండు సార్లు తన స్నేహితుడు వచ్చాడని చెప్పింది. ఇంకేముంది.. దొంగతనం గురించి ఆరా తీస్తే.. తమ కుమార్తె వ్యవహారం కూడా బయటపడింది. ఈ వ్యవహారానికి దొంగతనానికి సంబంధం ఉందని అనుమానించిన తల్లిదండ్రులు.. వెంటనే కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి వచ్చిన కుర్రాడి గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.
అయితే.. మేఘనకు జనవరిలో ఇన్‌స్టాగ్రాంలో సురేష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన బానోత్ సురేష్.. కూకట్పల్లి ఆల్విన్‌కాలనీలో నివాసముంటున్నాడు. స్విగ్గి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. మేఘనతో మెల్లగా చాటింగ్ మొదలుపెట్టాడు సురేష్. ప్రొఫైల్‌లో అందమైన యువకుని ఫొటో పెట్టటంతో ఆకర్షితురాలైన మేఘన.. అతడితో చాటింగ్ చేయటం మొదలుపెట్టింది. అది కాస్తా పెరిగి కాల్స్ మాట్లాడుకోవటం వరకు వచ్చింది. ఆ దశను కూడా దాటి ఒకరినొకరు కలుసుకోవాలనుకున్నారు. ఏప్రిల్ 20న ఇంట్లో ఎవరు లేని సమయంలో సురేష్‌ను ఇంటికి ఆహ్వానించింది మేఘన. ఇంటికి వెళ్లిన సురేష్.. వాళ్ల ఇంటిని పరిశీలించాడు. కూల్‌డ్రింక్ కావాలని అడగటంతో.. తీసుకొచ్చేందుకు మేఘన బయటకు వెళ్లింది. ఈ సమయంలో.. ఇంట్లో ఉన్న బీరువాను చూశాడు. తెరిచి చూస్తే.. దగదగలాడుతూ బంగారం మెరిసిపోతోంది. ఇంకేముంది.. కళ్లు జిగేల్మనటంతో దోచుకోవాలన్న కోరిక కలిగింది. అంతా తీసుకుంటే అనుమానం వస్తుందనుకున్నాడో..? లేక మొత్తం తీసుకునేందుకు ధైర్యం సరిపోలేదో..? సుమారు 6 తులాల వరకు తీసుకుని.. అనుమానం రాకుండా కూర్చున్నాడు. మేఘన తెచ్చిన కూల్‌డ్రింక్ తాగేసి.. సరదాగా కబుర్లు చెప్పుకుని వెళ్లిపోయాడు.