మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కురవి మండలం కందికొండ గ్రామానికి చెందిన మద్దూరి వీరన్నగా తెలిపారు.
కందికొండకు చెందిన మద్దూరి వీరన్న మహబూబాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఓ లోకల్ యాప్ రూపొందించుకుని.. మండలాల వారీగా ఏజెంట్లను నియమించుకున్నాడు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా చిన్న, సన్నకారు రైతులకు రుణాలు ఇస్తామని, ఎకరాకు రూ.6 వేల చొప్పున కడితే.. 45 రోజుల్లో రూ.40 వేల రుణాన్ని ఇస్తామని తెలిపాడు. ఎస్సీ, ఎస్టీ రైతులకు రుణం పూర్తిగా మాఫీ అవుతుందని.. బీసీలకు 50 శాతం రుణం మాఫీ అవుతుందని ఏజెంట్లకు చెప్పాడు. ఒక అప్లికేషన్‌పై ఏజెంట్‌కు రూ.700 కమీషన్ ఇస్తానని నమ్మబలికాడు. ఈ మేరకు 100 నుంచి 150 మంది ఏజెంట్లను నియమించుకుని.. ఐడీ కార్డుల పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.1,000 వసూలు చేశాడు.
వీరన్న మాటలు నమ్మిన నిరుద్యోగులు ఏజెంట్లుగా చేరి.. కమీషన్ల ఆశతో చనిపోయిన రైతుల పేర్లపైనా డబ్బులు వసూలు చేశారు. 45 రోజుల గడువు పూర్తయినా వీరన్న డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు ఏజెంట్లను నిలదీశారు. వీరన్న ఎంతకూ డబ్బులు ఇవ్వకపోవడంతో ఓ ఏజెంట్‌కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్యాలయంలో సోదాలు చేయగా.. అసలు నిజం బయటపడింది. ఆఫీసులో కొన్ని ఐడీ కార్డులు, అప్లికేషన్ ఫామ్స్ లభించాయి. దీంతో పోలీసులు వీరన్నను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఒక్క మహబూబాబాద్‌లోనే బ్రాంచ్ ఉందా.. మరికొన్ని చోట్ల బ్రాంచీలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.