కొందరు ఆడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు వివిధ రకాల నేరాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి ఏకంగా ఖాళీ స్థలంలో గంజాయి మొక్కలను పెంచుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని నందుల పేటలో ఖాళీ స్థలంలో గోపి అనే వ్యక్తి గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. ఇటీవల తెనాలి డీఎస్పీ స్రవంతి రాయి ఆధ్వర్యంలో వరుసగా గంజాయి అమ్మే వ్యక్తులను అదుపులోకి తీసుకుంటూ వచ్చారు.
గోపి అనే వ్యక్తి గంజాయి చెట్లు పెంచుతున్నట్లు ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు.. మందులు పేటలో బుధవారం రాత్రి స్థానిక పోలీసులు, సెబ్ అధికారులు దాడి చేశారు. ఈ మేరకు గోపిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెనాలిలో ఇంకా పలు ప్రాంతాల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం ఉందని.. అలాంటి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.