నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూరులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ గ్రామానికి చెందిన యువకుడు మాలవత్ సిద్ధార్థ్‌ను హత్య చేసి కొవిడ్ మృతిగా చిత్రీకరించిన ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ ఏసీపీ రఘు వెల్లడించారు. సిద్దార్థ్‌కు అదే గ్రామానికి చెందిన కనుక రాజేష్ సోదరితో ప్రేమ వ్యవహారం జరుగుతోందని తెలిపారు. ఈ విషయంలో సిద్ధార్థ్‌ను కనుక రాజేష్ పలుసార్లు బెదిరించాడని పేర్కొన్నారు.
పక్కా ప్రణాళిక
ఈ నెల 19న రాజేష్ స్నేహితులు దోన్ పాల్ పృథ్వి, జంబారత్ అన్వేష్, నందిపేట్‌కు చెందిన రాకేష్ యాదవ్, సల్మాన్ హాసకొత్తూరుకు చేరుకున్నారని వివరించారు. రాత్రి 11 గంటల సమయంలో ఆ గ్రామంలోని చికెన్ సెంటర్లో పని చేస్తున్న శేర్ల బాలా గౌడ్ ద్వారా సిద్ధార్థ్‌ను పిలుపించుకున్నాడని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలపై మెట్ల చిట్టపుర్లోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి చితకబాదినట్లు వివరించారు. తీవ్ర గాయాలైన సిద్ధార్థ్‌ని పెద్దమ్మ గుడి వద్దకు తీసుకొచ్చి రక్తపు మరకలు తుడిచి, దుస్తులు మార్చి బాలాగౌడ్‌కు అప్పగించారని వెల్లడించారు. అనంతరం భోజనం పెట్టి నొప్పుల మాత్రలు వేసి పడుకోబెట్టినట్లు పేర్కొన్నారు. తెల్లవారుజామున ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుందని రాకేష్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. మెట్‌పల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా. మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని వెల్లడించారు.