పాత తరానికి చెందిన ప్రముఖ నటి తీవ్ర అస్వస్థతతో కన్నుమూత. ధ్రువీకరించిన వైద్యులు.. ఫేస్‌బుక్, వాట్సాప్ సహా సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వచ్చిన వార్త ఇది. ఒక ఛానల్‌లో ప్రసారమైందంటూ గుర్తుతెలియని వ్యక్తులు దానిని వాట్సాప్ బృందాలకు పంపించారు. అది నిమిషాల్లో వేలమందికి చేరింది. సినీ ప్రముఖులు, పత్రికా విలేకరులు ఆరా తీస్తే తాను బతికే ఉన్నానని ఆమె స్వయంగా ప్రకటించారు.
ఆ చిత్రం చూస్తే అచ్చం టీవీలో వచ్చినట్లే ఉంటుంది. అందులోని విషయం అందరూ నమ్మేలా ఉంటుంది. అది ప్రముఖుల మరణ వార్త కావొచ్చు. ప్రమాద సమాచారం కావొచ్చు. అది కొందరిని ఆందోళనకు గురిచేస్తుంది. మరికొందరిని అయోమయంలోకి నెట్టేస్తుంది. వ్యక్తులపైనే కాదు సంస్థలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. అది నిజమేనా అని నిర్ధారించుకునేలోగానే అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టి చేయాల్సిన నష్టం చేసేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా వార్తలు(Fake News) క్రమంగా పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. మొబైల్ యాప్స్ సహాయంతో సైబర్ నేరగాళ్లు ఇలాంటి బోగస్ వార్తలు(Fake News) సృష్టించి జనంలోకి వదులుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ఇలాంటివారిని 10 నెలల్లో 15 మందిని అరెస్ట్ చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఏ వార్తనూ వెంటనే నమ్మవద్దని, విశ్వసనీయ వార్తా సంస్థల వెబ్‌సైట్లను, ఛానళ్లను పరిశీలించి నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.
ఇలా తెలుస్తుంది..
ఏదైనా వార్త, వీడియో నకిలీద(Fake News)ని, అసత్యమైంద(Fake News)ని అనుమానం వచ్చిన వెంటనే సామాజిక మాధ్యమాల పరిశోధన, అభివృద్ధి విభాగం వెంటనే ఫ్యాక్ట్‌చెక్ పేరుతో ఆ వార్త, వీడియో నకిలీదని, దాని మూలం ఫలానాచోట ఉందని వివరిస్తుంది.
గూగుల్:వార్తలు, వీడియోలు, కార్టూన్లు, ఫొటోలను రివర్స్ ఇమేజ్, సెర్చింగ్ ద్వారా క్షణాల్లో ఆయా వార్తలు, వీడియోలు, ఫొటోల వివరాలను తెలుపుతుంది. అభ్యంతరాలపై వేగంగా నిర్ణయం తీసుకుంటుంది.
ట్విటర్:వివాదాస్పద ప్రకటనలు, మాటలు, చేష్టలు, వీడియోలను ఎవరైనా పోస్ట్ చేస్తే చాలా సందర్భాల్లో ట్విటర్ ప్రతినిధులు స్వయంగా తొలగించడంతో పాటు ఆ హ్యాండిల్‌పై నిషేధం విధిస్తున్నారు.