ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం(Saidabad rape case) చేసి.. వారం రోజుల తర్వాత ఆత్మహత్యకు పాల్పడిన పల్లకొండ రాజుకు సంబంధించిన అంశాలపై పోలీసులు ఇంకా పరిశోధన కొనసాగిస్తున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఐదురోజులపాటు ఎక్కడెక్కడ తిరిగాడు? ఏఏ ప్రాంతాల్లో ఉన్నాడన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. సైదాబాద్ ఠాణాలో హత్యాచార ఘటన(Saidabad rape case) దర్యాప్తు ప్రక్రియ సాంకేతికంగా ముగిసినా... రాజు ఆత్మహత్యకు ముందు జరిగిన పరిణామాలను కోర్టుకు సమర్పించే అభియోగపత్రాల్లో పేర్కొనేందుకు అవసరమైన సమాచారం సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉప్పల్ నుంచి స్టేషన్ ఘన్‌పూర్ వరకూ ఉన్న 133 కి.మీ. మార్గంలో నిందితుడు ఎక్కడెక్కడున్నాడు అన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించారు.
ఇదీ చదవండి :Saidabad Incident: చిన్నారిని చిదిమేసిన రాజు ఛిద్రమై'పోయాడు'
నడక దారిలోనా..? ఆటోలోనా..?
హత్యాచార ఘటన(Saidabad rape case) అనంతరం ఈనెల 11 వరకూ నిందితుడు నగరంలోనే ఉన్నాడు. మలక్‌పేట, సంతోష్‌నగర్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, శాలిబండ, మొగల్‌పురా, చార్మినార్ పరిసరాల్లో తిరిగాడు. పోలీసులకు దొరికిపోతానన్న భయంతో 11న సాయంత్రం ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే బస్సు ఎక్కాడు. మధ్యలో దిగిన అతను ఎక్కడికి వెళ్లాడన్నది అంతుచిక్కలేదు. ఆ రోజు రాత్రి నుంచి స్టేషన్ ఘన్‌పూర్ చేరుకోవాలంటే నడిచి వెళ్తే రోజుకు 30 కి.మీ. చొప్పున అనుకున్నా నాలుగు రోజుల్లో చేరుకోలేడని అంచనా వేశారు.
- నడిచి వెళ్లాలంటే ఇందుకు అవసరమైన శక్తి కావాలి. నీళ్లు, ఆహారం తప్పనిసరిగా ఉండాలి. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎవరైనా చూస్తే తెలిసిపోతుంది. దీంతో అతడు కొన్ని కి.మీ. నడిచుంటాడని అంచనా వేశారు.
- బీబీనగర్ నుంచి గూడూరు, పగిడిపల్లె, భువనగిరిల మధ్య గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆటోలుంటాయి. బీబీనగర్ నుంచి భువనగిరి, రాయిగిరి, జమ్మాపూర్ వంగపల్లి వరకూ ఆటోల్లోనే ప్రయాణించి ఉంటాడని భావిస్తున్నారు.
- బస్సులు, ఆటోలతోపాటు నడుచుకుంటూ వచ్చినా సరే.. నాలుగైదు రోజుల్లో జనగామ లేదా వరంగల్‌కు చేరుకుంటాడన్న అంచనాతో పోలీసులు వరంగల్, జనగామ పరిసర ప్రాంతాల్లో నిఘా ఉంచారు.
- ఆత్మహత్య చేసుకుంటాడేమోనన్న అనుమానంతో ఈనెల 14, 15 తేదీల్లో తూర్పుమండలం టాస్క్‌ఫోర్స్ పోలీస్ బృందం, రఘునాథపల్లి, రాఘవాపూర్, చాగల్లు, స్టేషన్ ఘన్‌పూర్, జనగామ పోలీసులు నిఘాను పెంచారు.
- రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం తొలుత రైల్వే పోలీసులకు తెలిసింది. తర్వాత వరంగల్ జిల్లా పోలీసులకు తెలిసినప్పటికి హైదరాబాద్ పోలీసులు ఘటన స్థలానికి కేవలం 20 కి.మీ. దూరంలో ఉన్నారు.
రక్త నమూనాలు.. వేలిముద్రలు
సైదాబాద్ ఠాణా పరిధిలో నమోదైన హత్యాచారం కేసును మూసేసేందుకు అవసరమైన ప్రక్రియను పోలీసులు చేపట్టారు. చనిపోయింది రాజేనన్న ఆధారాలన్నింటినీ సేకరించారు. అతడుంటున్న గదికి వెళ్లి వేలిముద్రలు, సూర్యాపేటకు వెళ్లి కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం సేకరించారు. అతడు వినియోగించిన వస్తువులు, తాళం, బాలికను పూడ్చిపెట్టిన వస్త్రం, ఇతర వస్తువులను సేకరించి వాటిపై వేలిముద్రలను తీసుకున్నారు. అతడి మృతదేహం నుంచి రక్త నమూనాలను సేకరించి డీఎన్‌ఏ పరీక్షకు పంపించారు. ఆ పరీక్షలో ఆత్మహత్య చేసుకుంది రాజు అని నిర్ధరణ కాగానే దర్యాప్తు ప్రక్రియ ముగించనున్నామని సంయుక్త కమిషనర్ ఎం.రమేష్‌రెడ్డి తెలిపారు.