అతడో స్థిరాస్తి వ్యాపారి. చేతినిండా సొమ్ములు, వారాంతంలో విందులు వినోదాలు. అంతకు మించిన ఆనందాన్ని ఆస్వాదించేందుకు నెలలో రెండుసార్లు శ్రీలంక(Poker Players to Sri lanka) వెళ్లి వస్తుంటాడు. ఈ మధ్య క్యాసినోలో కోల్పోయిన సొమ్మును రాబట్టుకునేందుకు రూ. 25 లక్షల వరకూ అప్పులు చేసి మరీ ఆడాడు. వాటినీ జూదంలో పొగొట్టుకుని మనోవేదనతో గుండెపోటుకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. ఇలా జూదం వ్యసనంగా మారి అలవాటు మానుకోలేని ఎంతోమంది ప్రతినెలా పేకాట ఆడేందుకు దూర ప్రాంతాలకు(Poker Players to Sri lanka) వెళ్లేవారు పెరుగుతున్నారు.
సకల సౌకర్యాలతో
కొవిడ్ సమయంలో ఇంటికే పరిమితమైన పేకాటరాయుళ్లు.. సాధారణ పరిస్థితులు నెలకొనటంతో రెక్కలు కట్టుకుని ఛలో కొలంబో(Poker Players to Sri lanka) అంటున్నారు. గతంలో జూదప్రియులు గోవాకు ప్రాధాన్యతనిచ్చేవారు. సంపన్నవర్గాలు మలేసియా, సింగపూర్, మకావు వంటి చోటకు వెళ్లేవారు. ప్రస్తుతం శ్రీలంక(Poker Players to Sri lanka) రాజధాని కొలంబోలో క్యాసినో కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా సకల సౌకర్యాలతో ఫైవ్ స్టార్ హోటల్స్ అందుబాటులోకి వచ్చాయి.
వీసా లేకపోయినా వెళ్లొచ్చు
హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, గోవా వంటి నగరాలతో పోల్చితే కొలంబో ఫైవ్ స్టార్ హోటళ్లలో ఖర్చు చాలా తక్కువ. వారం, పది రోజుల ముందు రూ. 8000-10,000 లోపు విమాన టికెట్లు వస్తాయి. రెండు గంటల్లో ఎంచక్కా కొలంబో(Poker Players to Sri lanka) చేరనూవచ్చు. పాస్‌పోర్టు ఉంటే చాలు వీసాతో పనిలేకుండా లంక ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. ఇంతటి వెసులుబాటు ఉండటం, ఖర్చు తక్కువ కావటంతో హైదరాబాద్ నుంచి అక్కడకు వెళ్లే జూద ప్రియులు పెరుగుతున్నారని బేగంపేటకు చెందిన ట్రావెల్ సంస్థ ఏజెంట్ ఒకరు తెలిపారు. రూ.4లక్షల నుంచి 5లక్షలతో కొలంబోలో వారం రోజుల పాటు ఆనందాన్ని ఆస్వాదించి రావచ్చంటూ అమీర్‌పేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారి తెలిపారు. నెలకోసారి మిత్రులతో కలసి వెళ్లివస్తుంటానని వివరించారు. పేకాట వ్యసనం అని తెలిసినా అలవాటుపడ్డాక మానుకోవటం కష్టమంటూ ఆవేదన వెలిబుచ్చుతున్నారు.