PM Modi and Governor on uravakonda road accident : ఆంధ్రప్రదేశ్ ఉరవకొండ బూదగవి రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన 9 మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ప్రధాని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. రహదారి భద్రత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని గవర్నర్ సూచించారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే...
వివాహ వేడుకకు వెళ్లి వస్తూ.. అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వస్తున్న లారీ.. కారును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉరవకొండ మండలం నింబగల్లుకు చెందిన భాజపా కిసాన్ మోర్చా ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైన వెంకటప్పనాయుడి కుమార్తె ప్రశాంతి వివాహం ఆదివారం బళ్లారిలో జరిగింది. బంధువులంతా కలిసి కారులో వేడుకకు హాజరై తిరుగు ప్రయాణమయ్యారు.
అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు..
అనంతపురం - బళ్లారి జాతీయ రహదారిలోని బూదగవి - కొట్టాలపల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీ కారును వేగంగా ఢీకట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బయటకు తీయలేనంతగా మృతదేహాలు ఇరుక్కుపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన పొక్లెయిన్లు తెప్పించి మృత దేహాలను బయటకు తీశారు.