ఒక సినిమాలో పోలీసుల విచారణలో నిందితుడు అబద్ధం చెబితే ఒక యంత్రం గుర్తించి శబ్దం చేస్తుంది. అతను తప్పు అంగీకరించి నిజాలు చెప్పడం ప్రారంభిస్తాడు. సరిగ్గా ఇలాంటి ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలో ఇటీవల అర్ధరాత్రి వేళ అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఊరు, పేరు ఇతర వివరాలు అడిగారు.
మిషన్ అరుస్తోంది.. నిజం చెప్పు! - గుంటూరులో పోలీసుల పిన్స్ యాప్
ఓ వ్యక్తి రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. పోలీసులకు అనుమానం వచ్చి..వివరాలు ఆరా తీశారు. ఇంకా నమ్మక ఫోన్లో వేలిముద్రలు తీసుకున్నారు. అప్పుడే వాళ్ల దగ్గరున్న పిన్స్ అనేే యాప్ అరిచింది. వెంటనే తెలిసింది అతనో దొంగ అని. అతన్ని పట్టించింది పోలీసుల వద్ద ఉన్న పిన్స్ అనే యాప్. ఇది నేరాలు చేసిన వాళ్ల వేలిముద్రలను గుర్తిస్తుంది.

తాను గుంటూరులోనే ఉంటానని, రాత్రి సినిమాకు వెళ్లి వస్తున్నానంటూ బురిడీ కొట్టించే యత్నం చేశాడు. అతని వ్యవహారశైలిపై అనుమానంతో వేలిముద్రలను పిన్స్ యాప్‌లో పెట్టి పరిశీలించారు. పాత నిందితుడని సంకేతం ఇవ్వడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ వ్యక్తిని మీ ఇల్లు ఎక్కడ? ఏం చేస్తుంటావు? అర్ధరాత్రి ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావంటూ ప్రశ్నించారు. తనను అనుమానించవద్దని నమ్మించే ప్రయత్నం చేశాడు.
పిన్స్ మిషన్ అరుస్తుంటే అబద్ధాలు చెబుతావేంటి? అంటూ కౌన్సెలింగ్ చేశారు. అప్పుడు ఆ కేటుగాడు నిజం చెప్పడం ప్రారంభించాడు. ఒక ద్విచక్ర వాహనం చోరీ చేశానని.. ఆ తర్వాత మారిపోయానని చెప్పాడు. అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తే ఎనిమిది వరకు ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు తేలిందని సమాచారం. విజయనగరానికి చెందిన ఆ వ్యక్తి... పలు వాహనాల చోరీ కేసుల్లో నిందితుడని గుర్తించారు. పోలీసుల గస్తీ సమయంలో అక్కడ మరో వాహనం చోరీ చేయడానికి యత్నిస్తుండగా వారి కంట పడి దొరికిపోయినట్లు తెలిసింది. ‘ఎక్కడెక్కడ చోరీలు చేశావు? ఎన్ని వాహనాలు తస్కరించావు? ఎవరెవరికి విక్రయించావు? వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా’? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.