ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన వలపు వల తరహా బ్లాక్ మెయిలింగ్ ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలకు పాకింది. ఈ వలలో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పలువురు చిక్కుకున్నారు. ఒక వ్యక్తికి ఫేస్బుక్లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది, యాక్సెప్ట్ చేశాడు. తర్వాత కొద్ది సేపటికే వాట్సాప్ నుంచి ఓ వీడియో కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేస్తే అవతల వైపు ఓ యువతి నగ్నంగా కనిపిస్తూ మాటల్లోకి దించింది. బాధితుడిని కూడా బట్టలు విప్పి మాట్లాడమని కోరింది. ఇవతల వ్యక్తి బట్టలు విప్పక పోవడం వల్ల... పలుమార్లు ఫోన్ చేసి రకరకాల మాటలతో ఆ యువతి ఇవతలి వ్యక్తిని నగ్నంగా మారే విధంగా రెచ్చగొట్టింది. దీంతో బాధితుడు ఫోన్ కట్ చేశాడు.
బెదిరింపులు
అంతే కొద్దిసేపటికే అతని వాట్సాప్‌కి ఒక వీడియో వచ్చింది. అందులో ఇంతకు ముందు నగ్నంగా ఉన్న యువతితో వీడియో కాల్ మాట్లాడుతుండగా రికార్డు చేసిన వీడియో వచ్చింది. అంతేకాదు వేరే వ్యక్తి బట్టలు విప్పి మాట్లాడిన కాల్ని మార్ఫింగ్ చేసి పంపించింది. ఆ వీడియోను ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో అప్లోడ్ చేస్తామని బెదిరించింది. అప్లోడ్ చేయకుండా ఉండాలంటే రూ.10 వేలు వెంటనే తన అకౌంట్‌కి పంపాలంటూ బ్లాక్ మెయిల్ చేసింది.