తెలంగాణ

telangana

ETV Bharat / crime

murder: పేగుబంధం తెంచుకున్న తల్లి.. కుమారుడిని బావిలోకి తోసేసి హత్య

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మొఘల్‌పుర కాలనీలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతల్లే మతిస్థిమితంలేని తన కుమారున్ని బావిలో తోసి చంపేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

mother kill her son in peddapalli
పెద్దపల్లి జిల్లాలో కొడుకును చంపిన తల్లి

By

Published : Jun 22, 2021, 11:43 AM IST

Updated : Jun 23, 2021, 8:49 AM IST

మానసిక రోగి అయిన కన్నకొడుకుకు వైద్యం చేయించే స్తోమత లేక, అతని విపరీత ప్రవర్తన భరించలేక ఓ తల్లి తన పేగు బంధాన్ని తెంచుకుంది. అతన్ని బావిలో తోసి కడతేర్చింది. ఈ ఉదంతం పెద్దపల్లిలో సోమవారం సాయంత్రం జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది.

పెద్దపల్లి మొగల్‌పురా ప్రాంతానికి చెందిన సంకెళ్ల చంద్రయ్య, శ్యామల దంపతులకు కుమారుడు, కుమార్తె. కుమారుడు యశ్వంత్‌(16) మానసికస్థితి సరిగా లేదు. ప్రతినెలా రూ.5 వేల విలువైన మందులు వాడకపోతే అతడి మానసిక పరిస్థితి అదుపు తప్పుతుంది. ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేయడం ద్వారా చంద్రయ్యకు వచ్చే ఆదాయం కుటుంబపోషణకే సరిపోవడం లేదు. ఓ వైపు ఎదిగిన కూతురికి వివాహం చేయాలనే ఆలోచన... మరోవైపు కుమారుడి మానసిక పరిస్థితి ఆ తల్లికి మనశ్శాంతి లేకుండా చేశాయి. కొద్ది నెలలుగా కుమారుడికి వైద్యం అందించకపోవడం, మందులు వాడకపోవడంతో యశ్వంత్‌ ఆరోగ్య పరిస్థితి అదుపుతప్పింది. అతని మానసిక ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆడవారిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇరుగుపొరుగు వారి ముందు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా శ్యామల తీవ్ర మానసిక వేదనకు గురైంది.

కట్టెల కోసమని వెళ్లి..

సోమవారం సాయంత్రం పొయ్యిలోకి కట్టెలు తీసుకురావడానికి కుమారుడిని వెంటబెట్టుకుని స్థానిక కళాశాల వెనుకభాగంలోని పంట చేలోకి వెళ్లింది. అక్కడికి సమీపంలోని వ్యవసాయబావి వద్ద కొద్దిసేపు సేదతీరిన తరువాత కుమారుడు యశ్వంత్‌ను ఒక్కసారిగా బావిలోకి తోసేసింది. ఈత రాని యశ్వంత్‌ నీట మునిగి మృత్యువాత పడ్డాడు. అనంతరం ఇంటికి వచ్చిన శ్యామల భర్తకు విషయాన్ని తెలిపింది. అతను ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం ఉదయం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. శ్యామలను అరెస్టు చేసి, హత్యకేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

ఇదీ చదవండి:TRIPLE MURDER: త్రిపుల్ మర్డర్ కేసులో నిందితుల అరెస్ట్

Last Updated : Jun 23, 2021, 8:49 AM IST

ABOUT THE AUTHOR

...view details