PD Act on Goa Drug Dealer Dsouza : మాదకద్రవ్యాల సరఫరాపై ఉక్కుపాదం మోపిన తెలంగాణ పోలీసులు గోవా మాదక ద్రవ్యాల కేసులో ముగ్గురిపై పీడీ యాక్టు ప్రయోగించారు. బెయిల్ మీద విడుదలైన డిసౌజాపై పీడీ యాక్టు ప్రయోగించి అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు రిమాండ్కు తరలించారు. గతేడాది ఆగస్టులో ఓయూ పోలీసులు గోవాకు చెందిన ప్రితీష్ నారాయణ్ బోర్కర్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాలు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా బోర్కర్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతనిచ్చిన సమాచారం ప్రకారం గోవాకు చెందిన ఆరుగురిపై కేసు నమోదు చేశారు.
ఎడ్విన్ న్యూన్, డిసౌజాతో పాటు మరో ముగ్గురిపైనా కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 25వ తేదీన డిసౌజాను, నవంబర్ 5న ఎడ్విన్ న్యూన్ను నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇందులో డిసౌజాకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో చంచల్గూడ జైలు నుంచి బయటికి వచ్చి గోవా వెళ్లిపోయాడు. ఎడ్విన్, బోర్కర్ మాత్రం రిమాండ్ ఖైదీలుగా జైల్లోనే ఉన్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నెల క్రితం ఎడ్విన్, బోర్కర్పై పీడీ చట్టం ప్రయోగించారు. దీంతో ఏడాది పాటు ఇద్దరు నిందితులు జైల్లోనే గడపాల్సి ఉంటుంది.