తెలంగాణ

telangana

ETV Bharat / crime

అక్రమంగా భూమి కాజేశారు.. తప్పించుకోడానికి సినిమా ప్లాన్ వేశారు... చివరికి.. - పటాన్​చెరులో భూమి కబ్జా కేసు

Patancheruvu land kabza case : ప్లాటు యజమాని స్థానికంగా ఉండటంలేదని నిర్ధరించుకున్నారు. దాని వివరాలు సేకరించి తప్పుడు కాగితాలు సృష్టించి ముఠాలో సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ప్లాటు యజమాని ఫిర్యాదుతో... పోలీసులకు దొరికి పోతామేమో అన్న భయంతో తప్పించుకోడానికి మరో పన్నాగం పన్నారు. ఆ ప్లాన్​ బెడిసికొట్టడంతో ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు.

Patancheruvu land kabza case
Patancheruvu land kabza case

By

Published : Mar 16, 2022, 4:40 PM IST

Patancheruvu land kabza case : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో అక్రమంగా భూమి కాజేసిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 880 గజాల భూమిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని వెల్లడించారు. 5 కోట్ల 27 లక్షలకు విక్రయించారని... కోటికి పైగా అడ్వాన్స్‌ తీసుకుని పంచుకున్నారని తెలిపారు. యజమాని సునంద ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా... సినీఫక్కిలో మాదిరిగా మోసం చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

ఇలా తెలిసింది

రంగారెడ్డి జిల్లా మదీనాగూడకు చెందిన సునంద మల్పాని అనే మహిళ... సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో 2000 సంవత్సరంలో సర్వేనంబర్‌ 251లో 880 గజాల స్థలం కొనుగోలు చేసింది. అప్పుడప్పుడు వచ్చి తన ప్లాటు చూసుకునేది. ఎప్పటిలాగే మార్చి తొలి వారంలో తన స్థలం వద్దకు వెళ్లి చూసేసరికి ఎవరో ప్రీకాస్టింగ్‌తో ప్రహారీ నిర్మించారు. అనుమానంతో ఈసీ తీసి చూడగా ఆ స్థలం తాను అమ్మకుండానే గుర్రం చంద్రశేఖర్‌, ప్రవీణ్‌రెడ్డి అనే వ్యక్తుల పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ఉంది. ఈనెల 10న పటాన్‌చెరు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

ముఠాగా ఏర్పడి...

ఇస్నాపూర్​కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చాకలి గణేష్‌ అనే వ్యక్తి... ఆ ప్లాటు యజమాని స్థానికంగా ఉంటడం లేదని నిర్ధరించుకున్నాడు. ఈ విషయాన్ని చందానగర్‌కు చెందిన అతని స్నేహితుడు అభయ్‌కుమార్‌ పాత్రోకు చెప్పాడు. అతను తన స్నేహితులైన లక్ష్మారెడ్డి, ఖలీల్‌, చంద్రశేఖర్‌, ప్రవీణ్‌రెడ్డిలకు చెప్పగా వీరందరూ కలిసి ఎలాగైనా ఈ స్థలం కబ్జా చేయాలని పన్నాగం పన్నారు. అనంత అనే మహిళ పేరును ఆధార్​ కార్డులో ప్లాట్​ యజమాని సునంద మల్పానిగా మార్పించారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో సునంద మల్పానిగా చూపుతూ గుర్రం చంద్రశేఖర్‌, ప్రవీణ్‌రెడ్డి పేరు మీద రెండు భాగాలుగా రిజిస్ట్రేషన్‌ చేయించారు.

తప్పించుకోడానికి మరో ప్లాన్​

ఆ ప్లాటును మళ్లీ ఇస్నాపూర్​కు చెందిన మహ్మద్‌ అలీకి రూ.5.27 కోట్లకు విక్రయించేందుకు అగ్రిమెంట్‌ చేసుకున్నారు. రూ.1.27 కోట్లు అడ్వాన్స్‌ తీసుకుని అందరూ కలిసి పంచుకున్నారు. సునంద మల్పాని ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న నిందితులు... ఈ కేసు నుంచి బయటపడాలని మరో ప్లాన్ వేశారు. చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉంటే వారే విక్రయించారని చెబితే తప్పించుకోవచ్చని పన్నాగం పన్నారు. కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి జైపాల్‌రెడ్డి మోసం చేసి విక్రయించాడని ప్రచారం చేశారు. పోలీసుల విచారణలో కూడా అదే చెప్పారు.

దొంగ సాక్ష్యం చెప్పేందుకు డీల్‌

జైపాల్‌రెడ్డికి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు హత్నూరకు చెందిన ప్రకాష్‌ అనే వ్యక్తి దొంగ సాక్ష్యం చెప్పేందుకు లక్ష రూపాయలకు డీల్‌ కుదుర్చుకున్నారు. అయితే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన పోలీసులకు నిందితుల అసలు బండారం బయలు పడింది. అభయ్‌కుమార్‌, గణేష్‌, చంద్రశేఖర్‌, ప్రవీణ్‌రెడ్డి, అనంత, ప్రకాష్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరివద్ద నుంచి 27.56 లక్షల రూపాయల నగదు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మంది నిందితుల్లో ప్రధాన నిందితుడు లక్ష్మారెడ్డి, ఖలీల్‌, శివ పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పటాన్‌చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి తెలిపారు.

అక్రమంగా భూమి కాజేశారు.. తప్పించుకోడానికి సినిమా ప్లాన్ వేశారు... చివరికి..

ఇదీ చదవండి:KTR Inaugurates LB Nagar Underpass : 'కేంద్రం నుంచి కిషన్‌రెడ్డి రూ.10వేల కోట్లు తీసుకురావాలి'

ABOUT THE AUTHOR

...view details