Hyderabad Drugs Case Update : హైదరాబాద్ పంజాగుట్ట మాదక ద్రవ్యాల కేసులో స్టార్ బాయ్‌ని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. స్టార్‌బాయ్.. నైజీరియా లేదా దక్షిణ ఆఫ్రికాలో ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు ఇంటర్ పోల్ సాయం తీసుకోనున్నారు. ఇందుకోసం రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టార్ బాయ్ ఒకవేళ దేశంలోనే ఎక్కడైనా దాక్కొని ఉంటే ఇక్కడి నుంచి పారిపోకుండా ఉండటానికి లుక్‌ఔట్ నోటీస్ కూడా సిద్ధం చేశారు. దేశం విడిచి వెళ్లాలన్నా... ప్రవేశించాలన్నా స్టార్ బాయ్‌కు సాధ్యపడకుండా ఉచ్చు బిగిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లినా లుక్ ఔట్ సర్క్యులర్ ఉండటం వల్ల వెంటనే అధికారులు సులభంగా గుర్తించి సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
Panjagutta drugs case : పంజాగుట్ట మాదక ద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టోనీ... నైజీరియా, దక్షిణాఫ్రికా నుంచి మాదక ద్రవ్యాలు తెచ్చి ముంబయి, హైదరాబాద్, బెంగళూర్, గోవాలో విక్రయిస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. స్టార్ బాయ్ సాయంతో మాదక ద్రవ్యాలను తీసుకొస్తున్నట్లు టోనీ తెలిపాడు. డ్రగ్స్ కేసులో కీలకంగా మారిన స్టార్ బాయ్‌ను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Hyderabad Drugs Case: కాల్ డేటా ఆధారంగా టోనీ విచారణ.. రంగంలోకి ఈడీ?
నేరం అంగీకరించిన టోనీ..
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన టోనీ.. ఇటీవలే నేరం అంగీకరించాడు. ‘‘సార్.. నేను హైదరాబాద్ రాలేదు.. మీరు చెబుతున్న ఫోటో నాది కాదు... నైజీరియన్లంతా కొంచెం అటూ ఇటూ నాలాగే ఉంటారు.. కొకైన్ విక్రయిస్తున్నాను.. నా ఏజెంట్లను కూడా కలవను.. నాకు ఇక్కడ ఎవరూ తెలీదు.. ముంబయిలో ఉంటున్నా చాలా తక్కువమందితో మాత్రమే ఇంటర్నెట్ ద్వారా మాట్లాడుతుంటా.. ముంబయి.. హైదరాబాద్ నగరాల్లో కొకైన్‌ను అమ్మేందుకు హిందీ నేర్చుకున్నా.. కొకైన్ విక్రయించగా.. నాకు వేలల్లో మాత్రమే మిగులుతుంది.. నాకు తెలిసింది ఇంతే..” పోలీసుల విచారణలో కొకైన్ విక్రేత టోనీ.. పోలీసులు జరిపిన ఐదురోజుల విచారణలో అన్నమాటలివి. కొకైన్ సరఫరా చేసే స్టార్ బాయ్, హైదరాబాద్‌లో వినియోగదారుల గురించి ఎంత ప్రశ్నించినా టోనీ సమాధానాలు చెప్పలేదు. టోనీ వ్యవహారశైలిపై ముందు నుంచీ అనుమానంగా ఉన్న ఓ పోలీస్ ఉన్నతాధికారి మాత్రం.. అతడి గురించి వివరాలు సేకరించారు. టోనీ డ్రగ్స్ క్రయవిక్రయాలపై పూర్తి సమాచారం సేకరించారు. ఐదోరోజు విచారణలో ఒక్క ఫోటో చూపించి నిజం ఒప్పుకొనేలా చేశారు.
ఇదీ చదవండి: Drugs Case: డ్రగ్స్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. రహస్య ప్రాంతంలో విచారణ