Drug Peddler Tony: డ్రగ్స్ కేసులో రెండోరోజు టోనీ విచారణ ముగిసింది. దాదాపు ఇవాళ 8 గంటల పాటు వివిధ అంశాలపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో ప్రశ్నించారు. విచారణలో వ్యాపార వేత్తలతో నేరుగా మాట్లాడే వాడినని టోనీ చెప్పినట్లు సమాచారం. ఓ నైజీరియన్ స్నేహితుడి ద్వారా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్లు దర్యాప్తు అధికారులకు వెల్లడించాడు.
వాటిపై ఆరా
టోనీ హాజరైన ఈవెంట్స్, నిర్వాహకులు, పబ్స్, రేవ్ పార్టీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. టోనీ అనుచరుడు ఇమ్రాన్ బాబు షేక్, నూర్ అహ్మద్, ఏజెంట్లు, సబ్ ఏంజెట్లతో ఉన్న సంబంధాలపై లోతుగా ప్రశ్నించారు. స్టార్ బాయ్‌తో ఉన్న లింక్స్‌పై కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. మాదక ద్రవ్యాల కేసులో చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టోనీని పోలీసులు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు.
ప్రముఖులకు డ్రగ్స్ సప్లై
నైజీరియాకు చెందిన టోనీ 2013 నుంచి ముంబయిలో అక్రమంగా నివాసం ఉంటున్నాడు. గత రెండున్నరేళ్లుగా హైదరాబాద్‌లోని పలువురు వ్యాపారులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ముంబయిలో ఏజెంట్లను నియమించుకొని వాళ్ల ద్వారా ముంబయి, హైదరాబాద్, గోవా, బెంగళూర్, చెన్నైకి టోనీ మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టోనీ ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లో 13 మందిపై కేసు నమోదు చేసి అందులో 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు వ్యాపారవేత్తలు పరారీలో ఉన్నారు. వీళ్లంతా కూడా టోనీ నుంచి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇదీ చదవండి:'తెరాసకు తొత్తులుగా కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు.. వారికే మంచి హోదాలు'