కాసులకు కక్కుర్తి పడిన పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ గుత్తేదారుకు చెక్కు ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం చౌదర్పల్లిలో ఈ ఘటన జరిగింది.
ACB RIDE: ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి - చౌదర్ పల్లి పంచాయతీ కార్యదర్శి అనురాధ
చెక్కు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం చౌదర్ పల్లి పంచాయతీ కార్యదర్శి అనురాధ రెడ్ హ్యాండెడ్గా అనిశాకు చిక్కారు.
చౌదర్ పల్లి గ్రామంలో చేపట్టిన సీసీరోడ్డు బిల్లులకు సంబంధించి రూ.3 లక్షల చెక్కును గుత్తేదారుకు అందజేయగా.. మరో రూ.3 లక్షల 58 వేల చెక్కును అందించేందుకు డబ్బులు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి అనురాధ డిమాండ్ చేశారు. రూ.25 వేలు లంచం డిమాండ్ చేయగా... చివరికి రూ. 20 వేలు ఇచ్చేందుకు గుత్తేదారు, పంచాయతీ కార్యదర్శి మధ్య ఒప్పందం కుదిరింది. గత కొన్ని రోజులుగా డబ్బుల కోసం పంచాయతీ కార్యదర్శి అనురాధ.. ఆంజనేయులుపై ఒత్తిడి తీసుకురావడంతో ఆయన అనిశా అధికారులను ఆశ్రయించారు. జిల్లా కేంద్రంలోని కొత్తగంజ్ రైల్వే బ్రిడ్జి రహదారిపై గుత్తేదారు వద్ద నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యదర్శిని పట్టుకున్నారు. శుక్రవారం.. ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇదీ చూడండి:CMRF Scam: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో కుంభకోణం..!