Two orphan girls were raped: రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. నేరేడ్‌మెట్‌లోని ఓ చిల్డ్రన్ హోంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు అనాథ బాలికలపై నిర్వాహకుల్లో ఒకరు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. బాలికలు ఈ నెల 19న సఖి కేంద్రం అధికారులకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. నిర్వాహకుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మురళిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద.. విక్టర్, అతని భార్యపై జువైనల్ జస్టిస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. కేసు వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.
బాలిక పరారీతో వెలుగులోకి:మేడ్చల్ జిల్లా పరిధిలోని నేరేడ్‌మెట్ క్రాస్ రోడ్డు సమీపంలో ఓ ప్రైవేటు సంస్థ చిల్డ్రన్ హోం పేరుతో అనాథ బాలికలకు, యువతులకు వసతి కల్పిస్తోంది. దాదాపు అయిదేళ్లుగా కొనసాగుతున్న ఆశ్రమంలో పదేళ్ల నుంచి 25 ఏళ్ల వయసుండే 36 మంది ఆశ్రయం పొందుతున్నారు. వారిలో ఒక మేజర్, ముగ్గురు మైనర్లు ఈ నెల 19న హోం నుంచి పారిపోయారు. మేజర్, మరో బాలిక కలిసి సంగారెడ్డికి వెళ్లారు.
అక్కడ మేజర్‌కు తెలిసిన ఒకరి ఇంట్లో ఆశ్రయం పొందారు. తమతో వచ్చిన ఇద్దరు బాలికల్ని మాత్రం సికింద్రాబాద్‌లో వదిలేశారు. ఎటు వెళ్లాలో తెలియని చిన్నారులు.. కొన్ని గంటల తర్వాత తిరిగి హోంకు చేరుకున్నారు. విషయం తెలిసి.. మహిళాశిశు సంక్షేమశాఖ, సఖి కేంద్రానికి చెందిన అధికారులు బాలికలతో ప్రత్యేకంగా మాట్లాడారు. పారిపోవడానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.