SI Suspended: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో యువకుడి ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు వచ్చిన ఎస్సైపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఎస్సై ఉదయ్‌కిరణ్‌పై కేసు నమోదు చేసి... వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఎస్పీ సురేందర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణ అనంతరం చర్యలు తీసుకోనున్నారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గణపురం ఎస్సై ఉదయ్‌కిరణ్, షోరూం నిర్వాహకుడు మోతుకూరి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు ములుగు ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, చేతులతో భౌతికదాడులకు పాల్పడినట్లుగా వచ్చిన ఫిర్యాదుల మేరకు 306, 323 ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే...కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలకేంద్రానికి చెందిన నిప్పాని శ్రావణ్ కొన్నేళ్ల కిందట బాలాజి అనే హోండా షోరూంలో ద్విచక్రవాహనాన్ని ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేశారు. కిస్తీల కింద వాయిదాల పద్ధతిలో రుణం తీర్చారు. అయినప్పటికీ ఎన్‌వోసీ (నో ఆబ్జక్షన్) ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా షోరూం నిర్వాహకులు తిప్పుకొంటున్నారు. ఈనెల 10న తన బావమరిది ప్రశాంత్ (24)ను తీసుకుని షోరూంకు వెళ్లారు. అక్కడి నిర్వాహకులు.. వీరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో షోరూం యజమాని మోతుకూరి శ్రీనివాస్.. డయల్ 100కు కాల్ చేశారు.