రాచకొండ పోలీసు కమిషనరేట్ (Rachakonda Police Commissionerate) పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా (Online Cricket Betting Gang) గుట్టురట్టయింది. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజర్ షేక్ సాదిక్‌ను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారని పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. నిందితుడి నుంచి రూ.95 లక్షల విలువైన ప్రాపర్టీని సీజ్ చేయడంతోపాటు రూ.15 లక్షల 70వేల నగదు, 4 మొబైల్ ఫోన్లు, 28 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు.
ఆర్గనైజర్ సాదిక్ కుటుంబ సభ్యులకు చెందిన 9 బ్యాంక్ అకౌంట్‌లను గుర్తించి వాటిల్లో ఉన్న రూ.69 లక్షల 3వేల నగదును సీజ్ చేశామని చెప్పారు. నిందితుడు షేక్ సాదిక్ పలు యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తాడని తెలిపారు. ఈ యాప్‌లను సబ్ స్క్రైబ్ చేసుకుని బుకీల నుంచి ఐడీ, పాస్ వార్డ్ తీసుకుంటున్నాడని సీపీ పేర్కొన్నారు. ఆ తరువాత సోషల్ మీడియాలో ఆసక్తి ఉన్న వారితో బెట్టింగ్‌లకు పాల్పడుతుంటారని సీపీ తెలిపారు.