Secunderabad Fire Accident Update : భారీ అగ్నిప్రమాదం జరిగిన డెక్కెన్ స్పోర్ట్స్ మాల్ భవనంలో కనిపించకుండాపోయిన యువకుల కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రమాదం జరిగి మూడు రోజులు గడుస్తున్నా.. గల్లంతైన వారి కోసం గాలింపు సాగుతోంది. వసీం, జునైద్, జహీర్ కోసం జరిపిన గాలింపులో.. ఒకరి మృతదేహం అవశేషాలు లభించాయి. అయితే అవి ఎవరివి అనే విషయం ఇంకా తేలలేదు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.
Secunderabad Fire Accident latest news: అగ్నిమాపక శాఖ అధికారులు, క్లూస్ టీం నిపుణులు అన్ని అంతస్తుల్లో దాదాపు గాలించినా.. ఎలాంటి ఫలితం కనిపించ లేదు. మొదటి, రెండో అంతస్తు పైకప్పులు కూలి కిందపడటంతో అది పూర్తిగా శిథిలాలతో నిండింది. కెమెరాలు, ప్రత్యేక లైట్లతో గాలించిన క్లూస్‌టీం భవనంలోని కొన్ని వస్తువుల నమూనాలను సేకరించారు. ఆ శిథిలాల కింద మృతదేహాల అవశేషాలు ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వాటిని తొలగిస్తే పైకప్పు పరిస్థితి ఏంటి..: ప్రమాదం జరిగిన భవనంలో దాదాపు 10 వేల టన్నుల వ్యర్థాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వాటిని తొలగించడం ఇబ్బందికరంగా మారింది. ఇనుప గ్రిల్స్ పైకప్పులకు ఆనుకుని ఉండటంతో వాటిని తొలగిస్తే పైకప్పు పరిస్థితి ఏంటని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకోసం ఇంజినీరింగ్ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ప్రమాదం జరిగిన భవనాన్ని కూల్చి వేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. కూల్చివేత సమయంలో పక్కనున్న భవనాలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు.
బిల్డింగ్ పరిసరాల్లోకి రావొద్దంటూ నోటీసులు..: ప్రత్యేక సాంకేతికత ఉపయోగించి స్థానికుల ఇళ్లకు ఇబ్బంది కలగకుండా కూల్చివేయాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. ప్రమాదం జరిగిన భవనం పరిస్థితి ప్రమాదకరంగా ఉందని.. సమీప పరిసరాల్లోకి ఎవరూ రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు స్థానికంగా నోటీసులు అతికించారు. మరోవైపు కనిపించకుండా పోయిన వారి మృతదేహాలను అప్పగించాలని వారి బంధువులు కోరుతున్నారు. అవి అప్పగించే వరకు భవనం కూల్చివేత నిలిపివేయాలని కోరుతున్నారు.