నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో పాఠశాల బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్‌కు చెందిన 3 బస్సులకు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. మరొకరు తప్పించుకున్నారు. మృతుడు మక్తల్‌కు చెందిన మహదేవ్‌గా గుర్తించారు.
అసలు ఏం జరిగిందంటే..
పాఠశాలకు చెందిన బస్సుల్లో తేనెటీగలు ఉండటంతో యాజమాన్యం బుడగ జంగాలకు చెందిన మహదేవ్‌తో పాటు మరో వ్యక్తికి తేనెటీగలను తొలగించాలని చెప్పారు. ఈ ప్రయత్నంలో భాగంగా బస్సులో నిప్పు పెట్టి తేనెటీగలను తరిమి కొట్టేందుకు యత్నించగా.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే మూడు బస్సులకూ వ్యాపించాయి. ఘటనలో మహదేవ్ బస్సులోనే చిక్కుకుని, ఆగ్నికి ఆహుతయ్యాడు. మరో వ్యక్తి తప్పించుకున్నాడు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సహాయంతో మంటలను ఆర్పివేశారు. మహదేవ్ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు మక్తల్ సీఐ శంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: తెలంగాణ భవన్లో అగ్నిప్రమాదం.. తప్పిన ఆస్తినష్టం