ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా ముదినేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. రహదారి విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ.. కత్తిపోట్లకు దారి తీసింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు గాయపడగా.. చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ముదినేపల్లిలో దారి విషయమై తలెత్తిన వివాదంలో ఇర్ఫాన్ అనే వ్యక్తి.. నాగేంద్ర, మహేశ్‌పై కత్తితో దాడి చేసినట్లు బాధితుల బంధువులు పేర్కొన్నారు. ఇర్ఫాన్‌కు సంబంధించిన 20 మంది వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నట్టు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగేంద్ర, మహేశ్‌ను తొలుత గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఇవాళ తెల్లవారుజామున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ నాగేంద్ర మృతి చెందారు. మరో వ్యక్తి మహేశ్ పరిస్థితీ విషమంగానే ఉందని బంధువులు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని తెలుస్తోంది. మృతుడు నాగేంద్ర మాల మహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.