Three missing in RK Beach : విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 8మంది స్నేహితులు.. కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవాలని విశాఖపట్టణం వెళ్లారు. ఆర్కే బీచ్‌లో ఈత కోసం దిగారు. 8మందిలో ముగ్గరు గల్లంతవ్వగా... ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఊహించని ఘటనతో బాధితుల కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
హైదరాబాద్ బేగంపేట రసూల్‌పురా ఇందిరమ్మ కాలనీకి చెందిన పవన్, శివకుమార్, అజిస్, శివకుమార్, వినోద్, సిద్దు, మధు సహా మొత్తం 8 మంది గత నెల 30న కాచిగూడ నుంచి రైల్లో విశాఖపట్టణం వెళ్లారు. డిసెంబరు 31న ఆర్కే బీచ్‌లో గడిపారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. జనవరి 2న మరోసారి ఆర్కే బీచ్‌కు వెళ్లారు. సాయంత్రం హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు రైల్లో రిజర్వేషన్ సైతం చేసుకున్నారు. బీచ్‌లోకి దిగిన 8 మంది సరదాగా గడిపారు. ఫోటోలు దిగేందుకు ఇద్దరు శివకుమార్‌లతోపాటు అజీస్ సముద్రంలోకి వెళ్లారు. అలల ఉద్ధృతికి ముగ్గురు నీటిలోకి జారిపోయారు. మిగతావారు చూస్తుండగానే గల్లంతయ్యారు.
స్నేహితులు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీహెచ్ శివకుమార్‌ను వెలికి తీశారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు గుర్తించారు. కేశివకుమార్, అజీస్ జాడ ఇంకా తెలియరాలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుడు శివకుమార్ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. గల్లంతైనవారి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. మృతుడు సీహెచ్ శివకుమార్ ప్యారడైజ్ వద్దనున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్నాడు.