తెలంగాణ

telangana

ETV Bharat / crime

పక్కాప్లాన్​.. పాయింట్ బ్లాంక్ రేంజ్​లో ఫైరింగ్.. హైదరాబాద్ రియల్టీల హత్యకేసులో విస్తుపోయే నిజాలు - Gun firing on Realtors in Rangareddy district

Gun firing on Realtors : స్థిరాస్తి వ్యాపారంలో వివాదాలు రెండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. మాటలతో పరిష్కారమయ్యే సమస్యను తుపాకుల వరకు తీసుకువచ్చి.. ఇద్దరి చావుకు కారణమయ్యారు. హైదరాబాద్‌ శివారులో చోటుచేసుకున్న ఈ కాల్పుల ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.

Gun firings on Scorpio
స్కార్పియోపై కాల్పులు

By

Published : Mar 1, 2022, 10:46 AM IST

Updated : Mar 1, 2022, 8:04 PM IST

Gun firing on Realtors : పాయింట్ బ్లాంక్‌ రేంజ్​లో ఫైరింగ్​.. ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ సమీపంలో ఉదయం అదుపుతప్పి ప్రమాదానికి గురైన స్కార్పియో వాహనాన్ని స్థానికులు గమనించారు. కారుపై రక్తపు మరకలు ఉండటం.. వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లటాన్ని గమనించి మొదట రోడ్డు ప్రమాదంగా భావించారు. కానీ వాహనంలో బుల్లెట్ గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని గుర్తించి... పోలీసులకు సమాచారమిచ్చారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వ్యక్తిని హైదరాబాద్‌ బీఎన్​రెడ్డిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం.. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్న క్రమంలోనే కొంత దూరంలో అప్పటికే కాల్పుల్లో మృతిచెందిన వ్యక్తిని గుర్తించారు. కారు వద్ద లభ్యమైన ఆధారాలు... గాయపడిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో విచారణ జరిపిన పోలీసులు.... మృతుడు అల్మాస్‌గూడకు చెందిన శ్రీనివాస్‌రెడ్డిగా.. గాయపడింది రాఘవేందర్‌రెడ్డిగా గుర్తించారు.

పాయింట్ బ్లాంక్‌లో ఫైరింగ్​..

కర్ణంగూడలోని 20 ఎకరాల భూమి వివాదంలో ఉంది. దీనిని బడంగ్‌పేట్‌ పరిధిలోని అల్మాస్‌గూడకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి కొనుగోలు చేసి... యజమానితో అగ్రిమెంట్‌ చేయించుకున్నాడు. నాటి నుంచి నిత్యం ఇక్కడికి వస్తున్న ఆయన.... ఉదయం తన వ్యాపార భాగస్వామి అయిన రాఘవేందర్‌రెడ్డితో కలిసి స్కార్పియోలో పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలోనే పాయింట్ బ్లాంక్‌లో శ్రీనివాస్‌రెడ్డిపై కాల్పులు జరపగా... అక్కడికక్కడే ఆయన కుప్పకూలిపోయాడు. దీనిని చూసిన రాఘవేందర్‌రెడ్డి భయంతో కారులో పారిపోతుండగా... దుండగులు వెంబడించి, అరకిలోమీటర్‌ దూరంలో పట్టుకుని.. ఛాతికింది భాగంలో కాల్పులు జరిపారు. తీవ్ర రక్తస్రావమై... ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రాఘవేందర్‌రెడ్డిని.. బీఎన్​రెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.

'మట్టారెడ్డి హస్తం ఉంది..?'

శ్రీనివాస్‌రెడ్డి పొలం పక్కనే మట్టారెడ్డి అనే వ్యక్తికి చెందిన భూమి ఉంది. ఈ విషయంలోనే ఆర్నెళ్లుగా వివాదం కొనసాగుతున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. మట్టారెడ్డి మాట్లాడుకుందామని పిలిస్తేనే తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇంట్లో నుంచి రఘుతో కలిసి శ్రీనివాస్‌రెడ్డి పొలానికి వెళ్లినట్లు బాధిత కుటుంబం చెబుతోంది. కాల్పుల వెనక మట్టారెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తోంది.

"పటేల్‌గూడలో ఏడాది క్రితం 20 ఎకరాల్లో శ్రీనివాస్ రెడ్డి వెంచర్​ వేశారు. కాగా శ్రీనివాస్‌రెడ్డి వెంచర్ పక్కనే మట్టారెడ్డికి చెందిన భూమి ఉంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య 6 నెలలుగా భూ వివాదం జరుగుతోంది. మట్టారెడ్డి మాట్లాడుకుందామని పిలవడంతోనే శ్రీనివాస్‌రెడ్డి, రఘు వెంచర్ వద్దకు తెల్లవారుజామున వెళ్లారు. అక్కడే కొందరు దుండగులు వారిపై కాల్పులు జరిపారు. దీని వెనక ఉంది మట్టారెడ్డేనని మా అనుమానం."

- మృతుల కుటుంబీకులు

వెంబడించి కాల్చారు..

"కర్ణంగూడలోని వెంచర్ వద్దకు వెళ్లిన రియల్టర్లు శ్రీను, రఘులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌పై పాయింట్ బ్లాంక్‌లో గన్‌పెట్టి ఓ వ్యక్తి కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన చూసి రాఘవ భయంతో కారులో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. దుండగులు అతణ్ని వెంబడించారు. వెంబడిస్తూ.. అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాఘవను అక్కడ ఉన్న వాళ్లు గమనించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు."

- ప్రత్యక్ష సాక్షుల ప్రకారం వెల్లడించిన పోలీసులు

ఘటనాస్థలాన్ని పరిశీలించిన రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌... కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాల్పులు జరిపిన వెంటనే శ్రీనివాస్‌రెడ్డి చనిపోగా.. ఎవరు కాల్చారనే విషయం తెలుసుకునే లోగా రాఘవేందర్‌రెడ్డి మృతిచెందటంతో.. విచారణ కోసం పోలీసులు పూర్తిగా సాంకేతికతపైనే ఆధారపడ్డారు. మృతుల చరవాణిలను స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డిపై గతంలో కేసులు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కుటుంబసభ్యుల అనుమానం మేరకు మట్టారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:Mother suicide with children: ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి

Last Updated : Mar 1, 2022, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details