తెలంగాణ

telangana

ETV Bharat / crime

40 ఏళ్ల వివాహ బంధం.. మిగిల్చింది విషాదం.! - oldage husband murdered his wife in khammam district

శేష జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన వృద్ధదంపతుల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు ప్రాణాల్ని బలితీసుకున్నాయి. క్షణికావేశంలో నాలుగు దశాబ్దాల పయనం భార్యనే కడతేర్చే వరకు దారి తీశాయి. ఉన్నతస్థాయికి ఎదిగిన కుటుంబసభ్యులతో సంతోషంగా ఉండాల్సిన దంపతుల జీవితాలు విషాదాంతమయ్యాయి. అమెరికా వెళ్లే విషయంలో ఏర్పడిన గొడవలో భార్యను కిరాతకంగా హత్యచేసిన భర్త.. తర్వాత తానూ తనువు చాలించాడు.

murder in khammam
ఖమ్మంలో భార్యను చంపిన భర్త

By

Published : Mar 3, 2021, 6:09 PM IST

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగంబంజరకు చెందిన 65 ఏళ్ల వృద్దుడు భార్యను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. తర్వాత పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గొడవకు కారణాలు తెలుసుకొని నిర్ఘాంతపోయారు. రంగంబంజరకు చెందిన సంక్రాంతి సుబ్రమణ్యేశ్వరరావు కృష్ణా జిల్లా నుంచి 30ఏళ్ల క్రితం వలస వచ్చి స్థిరపడ్డారు. భార్య విజయలక్ష్మీతో కలిసి చిరు వ్యాపారులు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. వారికి సరిత, సునీత ఇద్దరు సంతానం. ఇద్దరు కుమార్తెలను బాగా చదివించి ప్రయోజకులను చేశారు. పెద్ద కూతురు సరిత వ్యాపార రీత్యా రామగుండంలో ఉంటున్నారు. సునీత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా అమెరికాలో స్థిరపడ్డారు. కుటుంబాన్ని ఉన్నతస్థాయికి చేర్చిన సుబ్రమణ్యేశ్వరరావు దంపతులు రంగంబంజరంలోనే కాలం వెళ్లదీస్తున్నారు. అప్పడప్పుడూ కుమార్తెల వద్దకు వెళ్లి వస్తుంటారు. ఆనందంగా సాగుతున్న ఆ కుటుంబంలో చిన్నపాటి వివాదం చంపుకునే వరకు వచ్చింది. వృద్ధాప్యంలోనూ క్షణికావేశంలో భార్యను చంపిన సుబ్రమణ్యేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అమెరికాకు వద్దని..

అమెరికాలో ఉన్న సునీత కొన్నాళ్లుగా తల్లిదండ్రులిద్దరినీ తన వద్దకు రావాలని కోరుతుంది. టికెట్లు బుక్‌ చేస్తానని చెప్పడంతో స్థానికంగా పనులున్నాయని సుబ్రమణ్యేశ్వరరావు నిరాకరించారు. భార్య విజయలక్ష్మీ మాత్రం వస్తామని సర్దిచెబుతూ వస్తోంది. దీనిపైనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తున్నాయని గ్రామస్థులు చెప్పారు. తాను ఒక్కదాన్నైనా అమెరికా వెళ్లొస్తానని భర్తతో చెప్పిందని.. కూతురు కూడా తల్లికి టికెట్‌ తీసుకుందని స్థానికులు తెలిపారు. మార్చి 15న ఆమెరికా వెళ్లాల్సి ఉండగా సుబ్రమణ్యేశ్వరరావు వద్దంటున్నాడని.. దీనిపైనే తరుచూ గొడవులు వస్తున్నాయని వెల్లడించారు. రాత్రి ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో క్షణికావేశానికి లోనైన భర్త.. ఇంట్లో కత్తితో భార్యను నరికి చంపాడు.

పురుగుల మందు తాగి

భార్యను కడతేర్చిన సుబ్రమణ్యేశ్వరరావు రాత్రంతా రక్తపు అడుగులతోనే ఇంట్లో తిరిగాడు. తెల్లవారిన తర్వాత ఆరుబయట సంచరించాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి పడుకున్నాడు. పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తి గమనించి చుట్టు పక్కలవారిని పిలిచాడు. నోట్లో నురుగులతో ఉన్న అతడిని 108 వాహనంలో కల్లూరు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఖమ్మం శిక్షణ ఐపీఎస్​ అధికారి స్నేహ, వైరా ఏసీపీ సత్యనారాయణ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికులను విచారించారు. అమెరికా పర్యటన కోసం ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదమే హత్యకు, ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. కేసు నమోదు చేసకొని దర్యాప్తు చేపట్టారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా వృద్ధాప్యంలో సంతోషంగా గడపాల్సిన వృద్ధులు తనువు చాలించడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

ఇదీ చదవండి:తల్లి మృతిపై కూతురు అనుమానం.. 75 రోజుల తర్వాత..?

ABOUT THE AUTHOR

...view details