అనుమానాస్పద స్థితిలో వృద్ధ దంపతులు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన స్వర్గం సత్యనారాయణ(65), బాలమణి(60) దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం జాగిలాలతో ఆధారాలు సేకరించారు.
మృతి చెందిన దంపతులకు సంతానం లేకపోడంతో సత్యనారాయణ మరదలు కూతురును దత్తత తీసుకున్నారు. ఆరేళ్ల కిందట ఆమె వివాహం కూడా జరిపించారు. గ్రామంలోని మృతుని అన్న దత్తత కుమారుడు శ్రీనివాస్ వీరి ఇంటి పక్కనే నివాసముంటున్నారు. శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం బంధువుల వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు.
ఆ మరుసటిరోజే గ్రామానికి చెందిన కొందరు ఆ ఇంటి వైపు వెళ్లగా వృద్ధ దంపతులు విగతజీవులుగా పడివుండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేపడతామని ఏసీపీ రమేశ్ తెలిపారు.