ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని తెలుగుగంగ కాలనీలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన తొరివేముల నాగయ్య, నాగమ్మ దంపతులను దగ్గరి బంధువే హత్య చేయడం సంచలనంగా మారింది. చాపాడు మండలం నాగులప్లలెకు చెందిన వీరయ్య నాలుగు రోజుల క్రితమే... తన పెద్దమ్మ, పెద్దనాన్నల దగ్గరకు వచ్చాడు. మూడ్రోజులుగా బాగానే ఉన్న వీరయ్య.. గురువారం అర్ధరాత్రి పెద్దమ్మ, పెద్ద నాన్నలు నిద్రిస్తుండగా రాడ్డుతో వారి తలలు పగులగొట్టాడు. తీవ్ర గాయాలపాలైన నాగయ్య, నాగమ్మ దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
తలుపులు తెరిచిన వాళ్లపైనా దాడి..
తెల్లవారుజామునే పాల కోసం వచ్చే నాగమ్మ ఎంతకీ రాకపోవడంతో... పాలు పోసేందుకు ఇంటి వద్దకు వెళ్లిన మహిళ తలుపు తెరిచేందుకు ప్రయత్నించింది. ఎంతకీ వాళ్లు చప్పుడు చేయకపోవడం, తలుపులు తెరవకపోవడంతో.. స్థానికులను పిలిచి విషయం తెలిపింది. వారంతా కలిసి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా... లోపలే ఉన్న నిందితుడు వీరయ్య.. వీరిపైనా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ముగ్గురు స్థానికులు గాయపడ్డారు. అనంతరం పారిపోతున్న వీరయ్యను వెంబడించి స్థానికులు పట్టుకున్నారు.