cyber crimes: గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరుగుతున్న ఆన్‌లైన్ నేరాలు
ఆన్‌లైన్ నేరాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన ఈ తరహా నేరాలు క్రమంగా నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. 2020 సంవత్సరానికి సంబంధించిన నేర గణాంకాల్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కొన్ని అంశాల్లో అయితే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను దాటి జిల్లాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతుండటం గమనార్హం.
cyber crime
By
Published : Sep 23, 2021, 5:33 AM IST
ఆన్‌లైన్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ తరహా నేరాలు ఎక్కువగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఏటా 90 శాతానికి పైగా కేసులుంటాయి. సైబర్ నేరస్థులు ఎక్కువగా మెట్రో నగరాలనే లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతుండడమే ఇందుకు కారణం. ఆన్‌లైన్ వినియోగం జిల్లాల్లోనూ పెరిగిపోవడంతో పాటు సైబర్ నేరాలను జిల్లాల స్థాయిలోనూ నమోదు చేస్తుండటంతో కొన్ని అంశాల్లో హైదరాబాద్ కంటే ఎక్కువ కేసులు జిల్లాల్లోనే వెలుగు చూస్తున్నాయి.
తొలి స్థానంలో జగిత్యాల..
అభ్యంతరకర అంశాలు, అశ్లీల దృశ్యాల ప్రసారానికి సంబందించిన కేసులు ఎక్కువగా జగిత్యాల జిల్లాలో నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా కేసులు 97 నమోదు కాగా ... జగిత్యాలలో అత్యధికంగా 28 నమోదు కావడం గమనార్హం. తర్వాత స్థానంలో ఉన్న హైదరాబాద్‌లో ఈ కేసుల సంఖ్య 21, మహబూబ్‌నగర్‌లోనూ ఈ కేసులు 18 నమోదయ్యాయి.
అవన్నీ రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే..
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రచారం చేసినందుకు రాష్ట్రంలో 111 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 87 కాగా... రెండో స్థానంలో ఉన్న మెదక్‌లో 11 కేసులు నమోదయ్యాయి. ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నమోదైన మొత్తం 306 కేసుల్లో హైదరాబాద్‌లో 180 ఉండగా, జగిత్యాలలో 43, సిద్దిపేటలో 24 నమోదయ్యాయి. డేటా చౌర్యం కేసులు మొత్తం 29 ఉండగా.. అవన్నీ రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్ నేరాలకు సంబంధించిన కేసుల్లో దాదాపు 91 శాతం ఒక్క హైదరాబాద్ కమిషనరేట్‌లోనే నమోదయ్యాయి. మొత్తం 1,405 కేసులకుగాను హైదరాబాద్ 1,866, రాచకొండలో 20, సైబరాబాద్ 1 ఉన్నాయి. సైబరాబాద్ కంటే ఎక్కువగా కరీంనగర్ 9 ఉండటం గమనార్హం.