ఏపీ గుంటూరు జిల్లా సీతానగరం పుష్కర ఘాట్ వద్ద యువతిపై సామూహిక అత్యాచారం(GANG RAPE CASE) జరిగి 14 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు పోలీసులు.. నిందితుల్ని పట్టుకోలేకపోయారు. ఈ దురాగతానికి పాల్పడిన వారెవరో నిర్ధారణకొచ్చినా వాళ్లను అదుపులోకి తీసుకోలేకపోయారు. నిందితులుగా అనుమానిస్తున్న వారి సమగ్ర వివరాలు, చిత్రాలు, చిరునామా, గత నేర చరిత్ర తదితర సమాచారమంతా అందుబాటులో ఉన్నా.. వాళ్లెక్కడున్నారో గుర్తించలేదు.
అప్పటి నుంచి పరారీలోనే!
కాబోయే భర్తతో కలిసి కృష్ణా నది తీరానికి వెళ్లిన యువతిపై గత నెల 19వ తేదీ రాత్రి సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బాధితురాలు, ఆమెకు కాబోయే భర్త సెల్‌ఫోన్లను దోచుకుని వాటిని తాడేపల్లిలోని ఒకరికి విక్రయించారని తేలడంతో నిందితులెవరనేది ఓ నిర్ధారణకు వచ్చారు. ఆరు పోలీసు బృందాలు వారి కోసం వెతుకుతున్నా నిందితులు తప్పించుకు తిరుగుతుండటం గమనార్హం. ఘటన జరిగిన రెండు, మూడు రోజుల తర్వాత ఓ నిందితుడు కృష్ణా కెనాల్ వద్ద స్నానం చేస్తుండగా.. మత్స్యకారులు గుర్తించి అతణ్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. నిందితుడు గూడ్సు రైలు ఎక్కి పరారయ్యాడు. పోలీసులు కృష్ణా కెనాల్ రైల్వేస్టేషన్‌వద్ద ఆగిన ఆ గూడ్సు రైలును తనిఖీ చేసినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. ఇప్పటివరకూ అతనితో పాటు మరో నిందితుణ్నీ పట్టుకోలేకపోయారు.