తెలంగాణ

telangana

ETV Bharat / crime

NIT student suicide : ఆన్‌లైన్‌ పాఠాలు.. ఒత్తిడి తట్టుకోలేక నిట్‌ విద్యార్థి ఆత్మహత్య - ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య

NIT student suicide : తాత్కాలిక సమస్యలకు చావే శాశ్వత పరిష్కారంగా భావించి ఎంతో మంది యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్నచిన్న కారణాలతోనే బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. చిన్నపాటి ఒత్తిడిని జయించలేక జీవితాన్నే ముగిస్తున్నారు. జీవం లేని జీవితాన్ని కొనసాగించలేనంటూ ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

NIT student suicide, west godavari suicide case
ఆన్‌లైన్‌ పాఠాలు.. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య

By

Published : Jan 22, 2022, 7:39 AM IST

NIT student suicide :జీవం లేని జీవితాన్ని కొనసాగించలేనంటూ ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. రెండేళ్లుగా ఒకే గదికి పరిమితం కావడం, ఆన్‌లైన్‌ పాఠాలు, డెడ్‌లైన్లు, మెయిళ్లు, మార్కులు ఇలా పలు విషయాలు తన మరణానికి కారణమని ఆత్మహత్యకు ముందు లేఖ రాశాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఆదూరి ప్రమోద్‌కుమార్‌ (20) వరంగల్‌ ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరం ఈఈఈ చదువుతున్నాడు. కరోనా కారణంగా ఎన్‌ఐటీ తెరవకపోవడంతో రెండేళ్లుగా ఆన్‌లైన్‌లోనే తరగతులు జరుగుతున్నాయి. ఇంటి నుంచే ఈ తరగతులకు హాజరవుతున్నాడు. ఇవే ఒత్తిడికి కారణమయ్యాయి.

ప్రాజెక్టు వర్కులో ‘ఏప్లస్‌’ గ్రేడ్‌...
చదువులో ముందుండే ప్రమోద్‌ ఇటీవల జరిగిన ప్రాజెక్టు వర్క్‌లోనూ ‘ఏప్లస్‌’ గ్రేడ్‌ సాధించాడు. వచ్చే నెలలో జరగనున్న గేట్‌ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు. ఇంజినీరింగ్‌లో పీజీ చేసి మంచి ఉద్యోగంతో జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు. ఇంతలోనే ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లోని తన గదిలో శుక్రవారం ఉరేసుకుని తనువు చాలించాడు. ప్రమోద్‌ తండ్రి ఆదూరి శ్రీనివాస్‌ మైసన్నగూడెం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేస్తున్నారు. తల్లి అరుణ గృహిణి. చేతికందొచ్చిన కుమారుడు విగత జీవుడై ఉండటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు. బోరున విలపించారు. ‘మమ్మల్ని ఇలా వదిలి వెళ్లిపోయావా కన్నా’ అంటూ కుమారుడి మృతదేహంపై పడి తల్లిదండ్రులు చేసిన రోదన అందరినీ కంటతడి పెట్టించింది. తండ్రి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సాగర్‌బాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details