NIA Raids in AP : ఏపీలోని విజయవాడ శివారు అజిత్‌సింగ్ నగర్ లూనాసెంటర్ నివాసముంటున్న కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ ఇంటిని మంగళవారం తెల్లవారుజామున ఎన్‌ఐఏ అధికారులు చుట్టుముట్టారు. స్థానిక పోలీసుల సాయంతో సోదాలు చేశారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున బలగాలు మోహరించడమే కాకుండా పౌరుల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారనే కోణంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ఎన్‌ఐఏ అధికారుల బృందం ఈ సోదాలు చేసినట్లు సమాచారం. ప్రభాకర్ సన్నిహితులు, కుటుంబ సభ్యుల బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఎన్‌ఐఏ దాడులు అప్రజాస్వామిక చర్యగా ప్రభాకర్ పేర్కొన్నారు. చరవాణి, కొన్ని పత్రాలు, వీడియోలు తీసుకుని నోటీసు ఇచ్చి వెళ్లారని చెప్పారు.
ఇటీవల మరణించిన డప్పు కళాకారుడు, జననాట్య మండలి నాయకుడు డప్పు రమేశ్ ఇంట్లోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు జరిపారు. న్యూ రాజరాజేశ్వరీపేట అమరావతి కాలనీలోని రమేశ్ భార్య జ్యోతి ఇంట్లో రాత్రి 7.15 గంటల వరకు తనిఖీలు చేశారు. భర్త చనిపోయి, ఇబ్బందుల్లో ఉంటే.. తనిఖీల పేరిట ఈ దాడులేంటని జ్యోతి ప్రశ్నించారు. ఎన్‌ఐఏ సోదాలను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు కొద్దిసేపు ఆందోళన చేశాయి. ఉపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు.
అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం విజయవాడ వచ్చిన సమయంలో.. ఇంటి తాళాలు పగులగొట్టి సోదాలు చేయాల్సిన అవసరం ఏంటని మావోయిస్టు ఆర్కే భార్య శిరీష ప్రశ్నించారు. భర్త, కొడుకును పొగొట్టుకున్న తనను రెండేళ్లుగా తనిఖీల పేరిట వేధింపులకు గురి చేస్తున్నారన్నారని వాపోయారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పారు.
మూడు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో డిజిటల్ పరికరాలు, పలు పోస్టర్లు, బ్యానర్లు, మావోయిస్టు సాహిత్యం, కరపత్రాలు, డైరీలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. రెండేళ్ల కిందట జరిగిన ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నట్లు పేర్కొంది.