నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఎన్‌ఐఏ అధికారులు ఆదివారం జరిపిన సోదాలు కలకలం రేపాయి. విదేశాల్లోని అనుమానిత వ్యక్తులతో సంభాషణ జరుపుతున్నట్లు గుర్తించిన వ్యక్తిని వారు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం హైదరాబాద్‌కు తరలించారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆర్మూర్‌లోని ఓ కాలనీకి చెందిన వ్యక్తి విదేశాల్లోని అనుమానితులతో గత కొంతకాలంగా మాట్లాడుతున్నాడు. ఇదే సమయంలో అతడి ఖాతాలకు పెద్దమొత్తంలో నగదు బదిలీ కూడా జరిగినట్లు కేంద్ర నిఘా సంస్థలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కుట్ర కోణంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో పకడ్బందీ బందోబస్తు నడుమ ఆర్మూర్‌లోని అతడి ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
సదరు వ్యక్తి గతంలో ఓ చికెన్ సెంటర్‌లో పనిచేశాడని, ఏడాదిగా ఖాళీగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇదే వ్యవహారంలో మరో ఇద్దరిని నిజామాబాద్ పోలీసు కమిషనరేట్‌లో నిఘా వర్గాలు విచారిస్తున్నట్లు తెలిసింది. పీఎఫ్‌ఐ పేరిట దేశంలో మతపరమైన దాడులకు కుట్రపన్నిన కేసు తాజాగా నిజామాబాద్‌లో వెలుగుచూసింది. ఇప్పటికే 28 మంది వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలపై ఇటీవల ఎన్‌ఐఏ అధికారులు జిల్లాకు వచ్చారు. అంతలోనే మరో కేసులోనూ వారు జిల్లాకు రావడం చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి:CPM: ఇళ్ల జాగా కోసం సీపీఎం ఆందోళన.. పోలీసులతో తీవ్ర వాగ్వాదం
అలవోకగా 'లా'.. ఒకేసారి 11 గోల్డ్ మెడల్స్‌తో పల్లవి సత్తా.. చూపు లేకపోయినా..