newly married women suicide: పెళ్లైన ఐదు మాసాలకే ఓ నవవధువు తనువు చాలించింది. అదనపు కట్నం కోసం అత్తమామలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చందానగర్‌లోని డొయెన్స్ కాలనీకి చెందిన సయ్యద్ హమీద్.. పాతబస్తీకి చెందిన ఫాతిమాను ఐదు నెలల క్రితం నిఖా చేసుకున్నాడు. మూడు నెలల తర్వాత హమీద్ దుబాయ్‌కి వెళ్లిపోయాడు. ఫాతిమా.. అత్తమామలతోనే ఉంటుంది.
భర్త దుబాయ్‌కు వెళ్లినప్పటి నుంచి ఫాతిమాను అత్తమామ వేధించటం ప్రారంభించారు. అదనపు కట్నం తీసుకురావాలని నిత్యం వేధింపులకు గురిచేయగా.. తీవ్ర మనస్తాపానికి గురైన ఫాతిమా ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణం చెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.