New Type of Crime in Hyderabad: భాగ్యనగరంలో ఈ మధ్య కొత్త తరహాలో నేరాలు జరుగుతున్నాయి. కొందరు రూ. కోట్లు కొట్టేసేందుకు, మరికొందరు వివాహేతర సంబంధాల్లో అడ్డు తొలగించేందుకు షార్ప్ షూటర్లను రప్పిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఘటనలను చూద్దాం. ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో కొద్దిరోజుల క్రితం ఇద్దరు వ్యక్తులను సుపారీ తీసుకున్న హంతకులు దారుణంగా కాల్చి చంపారు. తాజాగా తన భర్తను చంపించేందుకు ఎల్బీనగర్‌లో ఉంటున్న మహిళ ప్రియుడి ద్వారా నల్గొండ జిల్లాకు చెందిన రౌడీషీటర్‌కు రూ.5లక్షలు సుపారీ ఇప్పించింది.
భర్త కారుకు జీపీఎస్...
ఎల్బీనగర్ ఠాణా పరిధిలోని మన్సూరాబాద్‌లోని మధురానగర్‌లో ఉంటున్న వెంకటేష్, హరిత వివాహేతర బంధాన్ని కొన్నేళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం వెలుగుచూడ్డంతో హరిత భర్త భాస్కర్ సరస్వతి నగర్‌కు మకాం మార్చాడు. అక్కడికి వెళ్లినా హరిత, వెంకటేశ్‌లు ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. ఇసుక వ్యాపారం చేస్తున్న భాస్కర్ ఎక్కువగా రాత్రి వేళల్లో బయటకు వెళ్తుండడంతో అతడి కారుకు రహస్యంగా జీపీఎస్‌ను అమర్చారు.
భాస్కర్ బయటకు వెళ్లగానే వెంకటేష్ రహస్యంగా హరిత ఇంటికి వచ్చేవాడు. ఇరుగు, పొరుగు వారు భాస్కర్‌కు ఈ విషయాన్ని చెప్పడంతో అతడు హరితతో గొడవపడ్డాడు. దీంతో ఆమె తన భర్తను చంపేయ్యాలంటూ వెంకటేష్‌కు చెప్పింది. తొలుత ఒక్కతే ఇంట్లోంచి వెళితే తర్వాత భాస్కర్‌ను చంపిస్తానని అతడు చెప్పాడు. పథకంలో భాగంగా ఈనెల 16న ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయింది. తరువాత ఈ ప్రణాళిక భాస్కర్ దృష్టికి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో హరిత, వెంకటేష్‌లను అరెస్ట్ చేశాడు.