కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. రాజంపేట కాలువ పక్కన, ముళ్ల పొదల్లో.. అప్పుడే పుట్టిన ఆడపిల్లను గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయారు. పాప ఏడుపును విన్న స్థానికులు చుట్టుపక్కల వెతికారు. ముళ్ల పొదల్లో ఉన్న పాపను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ముళ్లపొదల్లో ఆడశిశువు.. రక్షించిన స్థానికులు - ఆడపిల్లను వదిలించుకున్న కుటుంబసభ్యులు
నన్ను కనండి అంటూ మిమ్మల్ని అడిగానా? సరే మీ ప్రేమతోనే పుట్టిన అనుకుందాం. మరి ఎందుకు నన్ను ఇలా వదిలేశారు. కనీసం నా ఏడుపునైనా మీరు సరిగా విన్నారా? నన్ను తనివి తీరా చూసుకున్నారా? నేను పుట్టి కనీసం రోజు కూడా కాలేదు. నన్ను వదిలేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ఓహ్.. ఆడపిల్లని అని ఇలా రోడ్డున పడేశారా? ఇలా ఆలోచించి వదిలేసిన మీరు అసలు మనుషులే కాదని నా అంతరాత్మ చెబుతోంది. లేకపోతే మీ నుంచి నన్ను ఎవరైనా దూరం చేసేందుకు ఇలా రోడ్డు మీద పడేశారా? త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్లిపోండి. - రోడ్డు పక్కన పడి ఉన్న ఓ చిన్నారి ఆత్మరోదన
ముళ్లపొదల్లో ఆడశిశువు.. సపర్యలు చేసిన స్థానికులు
ఎస్సై వెంకటేశ్ సిబ్బందితో వచ్చి శిశివును తీసుకుని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. పాప పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాగజ్నగర్ ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరపనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.