Naveen Reddy Arrest In Dentist Kidnap Case : అమెరికా పెళ్లి సంబంధంరావడంతో హైదరాబాద్ మన్నెగూడకు చెందిన దంతవైద్యురాలికి ఈనెల 9న తల్లిదండ్రులు నిశ్చితార్ధం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్రపన్నాడు. ఇందుకోసం అనుచరులతోపాటు తన ప్రాంఛైజీ స్టాళ్లలో పనిచేసే 36మందిని ముందురోజు రాత్రి మన్నెగూడకు రప్పించాడు.
అమెకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారంటూ నమ్మించి అపహరణ ప్రణాళికను రచించాడని పోలీసులు తేల్చారు. నవీన్ రెడ్డి సహా అంతా ఉదయం 11:30 గంటలకు.. మూడుకార్లు, ఓ డీసీఎంలో మన్నెగూడలోని యువతి ఉండే ఇంటికి చేరుకున్నారు. పథకం ప్రకారం కర్రలు, రాడ్లతో నిలిపి ఉంచిన కార్లను ధ్వంసం చేశారు. నవీన్ రెడ్డిని అడ్డుకోబోయిన యువతి తండ్రి, బాబాయ్‌పైనా వారు దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి సోఫా, ఫర్నీచర్ సహా ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు.
ఆ తర్వాత యువతిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన నవీన్ రెడ్డి కారులో కూర్చోబెట్టాడు. నవీన్ రెడ్డి, రూమెన్, మరో ఇద్దరు కలిసి యువతిని అపహరించుకొని నల్గొండ వైపు పారిపోయినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మరొకరితో విహవానికి ఎలా అంగీకరించావని యువతిని కొట్టడంతో.. నుదురు, వీపు, చేతిపై గాయాలయ్యాయి. పోలీసులకు పట్టుబడకుండా మిర్యాలగూడకు వెళ్లే దారిలో.. నవీన్ రెడ్డి, అతని ముగ్గురు స్నేహితులు ఫోన్లు స్విచాఫ్ చేశారు.
మిర్యాలగూడ దాటిన తర్వాత నవీన్ రెడ్డి స్నేహితుడు రూమెన్ ఫోన్ ఆన్ చేశాడు. పోలీసులు కేసు నమోదుచేసి గాలిస్తున్న విషయం తెలుసుకొని నవీన్ రెడ్డిని అప్రమత్తంచేశాడు. యువతిని ఇంటి వద్ద వదిలేద్దామని నవీన్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ముగ్గురు మధ్యలో దిగిపోగా మరొక స్నేహితుడు సాయంతో.. దంత వైద్యురాలిని ఇంటికి నవీన్ రెడ్డి పంపాడు. మన్నెగూడ ఆర్టీఏ కార్యాలయం వద్దకు రాగానే యువతికి ఫోన్ ఇచ్చి.. తన తండ్రికి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నట్లు చెప్పమని సూచించారు.