తెలంగాణ

telangana

ETV Bharat / crime

National sc commission at guntur: 'రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నాం'

ఏపీలో జరిగిన రమ్య హత్య ఘటనపై నిజనిర్ధారణ కోసం గుంటూరులో జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటన హడావుడిగా సాగింది. హత్య జరిగిన ప్రాంతాన్ని కమిషన్​కు చూపించకుండానే అధికారులు వారిని తీసుకెళ్లారు. రమ్య కుటుంబంతో మాట్లాడిన తర్వాత రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నుంచి వినతులు స్వీకరించారు. రమ్య హత్య కేసుని తీవ్రంగా పరిగణించామని... దోషులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని ఎస్సీ కమిషన్ వైస్‌ ఛైర్మన్ అరుణ్ హెల్దేర్ పేర్కొన్నారు.

National sc commission at guntur, ramya murder case
రమ్యకేసుపై జాతీయ ఎస్సీ కమిషన్, రమ్య హత్యకేసు

By

Published : Aug 24, 2021, 7:21 PM IST

Updated : Aug 24, 2021, 8:00 PM IST

ఆంధ్రప్రదేశ్‌ గుంటూరులోని పరమయ్యకుంటలో ఈనెల 15న జరిగిన రమ్య హత్యపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. భాజపా ఎస్సీ మోర్చా, మహిళా మోర్చా ఫిర్యాదు మేరకు ఎస్సీ కమిషన్ బృందం గుంటూరులో మంగళవారం పర్యటించింది. కమిషన్ వైస్​ ఛైర్మన్​ అరుణ్ హల్దేర్ నేతృత్వంలోని సుభాష్ పార్థి, అంజు బాల, డైరక్టర్ సునిల్ కుమార్​తో కూడిన బృందం.. రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించింది. అయితే రమ్య హత్యకు సంబంధించి ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎస్సీ కమిషన్ పర్యటనను పోలీసులు, అధికారులు తమ కనుసన్నల్లో జరిగేలా జాగ్రత్తపడ్డారు. కమిషన్ బృందం మొదటగా రమ్య హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించాల్సి ఉంది. అక్కడ మార్కింగ్ కూడా చేసి ఉంచారు. కానీ వారిని అక్కడ ఆగనీయకుండా నేరుగా రమ్య నివాసానికి తీసుకెళ్లారు. కమిషన్​ బృందం రాకకోసం ఘటనా స్థలి వద్ద వేచిఉన్న భాజపా నాయకులు, దళిత సంఘాల నేతలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల తీరుపై మండిపాటు..

రమ్య కుటుంబ సభ్యులతో కమిషన్ బృందం... 20 నిమిషాలు మాట్లాడింది. హత్యకు సంబంధించిన అన్ని విషయాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు రమ్య కుటుంబసభ్యులు తెలిపారు. హత్య జరిగిన తీరు, అనంతరం పోలీసులు, ఏపీ ప్రభుత్వ స్పందనను వివరించామన్నారు. ఈ సమయంలో పోలీసులు.. రాజకీయ పార్టీలు, మీడియాను అనుమతించలేదు. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు మాత్రం అక్కడకు వెళ్లారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన భాజపా మహిళా కార్యకర్తలు... రమ్య ఇంటి వైపు దూసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో జరిగిన తోపులాటలో నళిని అనే మహిళా నేత కిందపడిపోయారు. ఏపీ పోలీసుల తీరుపై భాజపా నేతలు, దళిత సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు.


విజ్ఞాపనలు స్వీకరించిన కమిషన్​..

రమ్య ఇంటి నుంచి కమిషన్ నేరుగా గుంటూరులోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకుంది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నుంచి విజ్ఞాపనలు తీసుకున్నారు. కేవలం రమ్య ఘటన గురించే కాకుండా ఏపీలో దళితులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయా సంఘాల నాయకులు కలిశారు. భాజపా నేతలు కూడా ఎస్సీ కమిషన్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. వైకాపా పాలనలో మహిళలు, దళితులపై దాడులు పెరిగిపోయిన విషయాన్ని ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు కమలం పార్టీ నేతలు గుడిసె దేవానంద్, నిర్మల తెలిపారు. రమ్య హత్యకేసులో ఏపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఎస్సీ కమిషన్ బృందాన్ని కలవకుండా పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారని పేర్కొన్నారు.

వైకాపా నేతల ప్రత్యేక భేటీ...

అనంతరం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. ఎస్సీ కమిషన్​ బృందంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దళితుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని వారికి వివరించారు. రమ్య హత్య కేసులో ఏపీ ప్రభుత్వం, పోలీసులు సత్వరం స్పందించినా.. విపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నట్లు వైకాపా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు.


నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం

ఇక రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కమిషన్ సభ్యులు సుభాష్ పార్థి తెలిపారు. కుటుంబ సభ్యులతో పాటు వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రమ్య హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని, ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అందరి నుంచి వినతులు తీసుకున్న అనంతరం ఎస్సీ కమిషన్ బృందం.. ఏపీ సచివాలయానికి వెళ్లింది.

రమ్య ఇంటికి జాతీయ ఎస్సీ కమిషన్ బృందం

ఇవీ చదవండి:

Last Updated : Aug 24, 2021, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details