National SC Commission on Narayana suspicious death: ఈనెల 19న అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఏపీ నెల్లూరు జిల్లా కందమూరుకు చెందిన ఎస్సీ యువకుడు నారాయణ మృతి కేసుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. మృతిపై వారంలో వివరాలు ఇవ్వాలని గతంలోనే జిల్లా అధికారులను ఆదేశించినా వారు స్పందించకపోవటంతో ఎస్సీ కమిషన్ నేరుగా రంగంలోకి దిగింది. కందమూరులో పర్యటించిన జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్‌కుమార్.. నారాయణ మృతిపై విచారణ చేపట్టారు. తీవ్రగాయాలతో అటవీ ప్రాంతంలో నారాయణ చెట్టుకి వేలాడటం, మూడవ రోజు వరకు పోస్టుమార్టం చేయకపోవడం, నలభై మంది పోలీసులతో మృతుడి కుటుంబ ఆచారానికి విరుద్దంగా మృతదేహాన్ని దహనం చేయటం, కనీసం డెత్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం, ఎస్ఐ కొట్టి చంపారనే ఆరోపణలు... తదితర అంశాలపై జాతీయ ఎస్సీ కమిషన్ సమగ్ర విచారణ చేపట్టింది.
ఏం జరిగిందంటే..: నెల్లూరు జిల్లా కందమూరుకు చెందిన ఎస్సీ యువకుడు ఉదయగిరి నారాయణ (38) ఈనెల 19న అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. అతడి మృతిపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అతడిని తీవ్రంగా కొట్టి.. చిత్రహింసలకు గురి చేసి చంపేశారని, ఆ హత్యోదంతం వెలుగు చూడకుండా ఉండేందుకే ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసుకు సంబంధించి తొలి నుంచీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వీటికి మరింత బలం చేకూర్చేలా ఉంది. బాధ్యుడైన ఎస్సైని కాపాడేందుకు పోలీసు ఉన్నతాధికారులపై జిల్లా మంత్రి ఒత్తిడి తెచ్చి ఈ వ్యవహారమంతా నడిపించారని ప్రతిపక్ష తెదేపా ఆరోపిస్తోంది.
అనేక సందేహాలు..
- తన భర్తది ఆత్మహత్య కాదని.. పొదలకూరు ఎస్సై కరీముల్లా, ఇటుకల కర్మాగారం యజమాని వంశీనాయుడు కలిసి కొట్టి చంపేశారని, ఆ తర్వాత మృతదేహాన్ని ఉరికి వేలాడదీశారని మృతుడి భార్య పద్మావతి ఆరోపించినా పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. నారాయణది ఆత్మహత్యగానే పేర్కొంటూ సీఆర్‌పీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
- ఆ తర్వాత.. ఇటుకల కర్మాగారం యజమాని వంశీ నాయుడు అతన్ని ఆత్మహత్యకు పురికొల్పాడని, ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడని పేర్కొంటూ సెక్షన్లు మార్చారు.
- జూన్ 19న మృతి చెందితే 21 వరకూ పోస్టుమార్టం నిర్వహించలేదు. తెదేపా సహా ప్రతిపక్ష పార్టీలు, ఎస్సీ సంఘాల నాయకుల ఆందోళన తర్వాతే చేశారు.
- నారాయణ మర్మాంగాలు, ఛాతీపై ఉన్న గాయాల విషయాల్ని పోస్టుమార్టం నివేదికలో ప్రస్తావించలేదు.