shilpa chowdary custody news : పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చంచల్‌గూడ మహిళా జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శిల్పను మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు... గోల్కొండ ఏరియా ఆస్పత్రిలో వైద్య చికిత్సలు చేయించారు. అనంతరం నార్సింగి ఎస్వోటీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇప్పటికే రెండు రోజుల పాటు శిల్పా చౌదరిని విచారించిన పోలీసులు... మరో మూడు రోజులపాటు ఆమెను కస్టడీకి తీసుకొని ప్రశ్నించనున్నారు. ఆమెపై నార్సింగి పీఎస్‌లో ఇప్పటివరకు మూడు కేసులు నమోదయ్యాయి. రూ.7 కోట్ల మోసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరికొంత మంది నుంచి డబ్బులు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. శిల్ప ఇంట్లో నుంచి పోలీసులు ఇప్పటికే పలు పత్రాలు, బ్యాంకు ఖాతాలు స్వాధీనం చేసుకున్నారు.
ప్రశ్నల వర్షం
ఇతరుల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులను స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు... కొంతమందికి ఇచ్చినట్లు శిల్పా చౌదరి పోలీసులకు తెలిపారు. శిల్ప చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు పలువురికి నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆమె వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మూడు రోజుల పాటు శిల్పను ప్రశ్నించి... ఆమె వద్ద నుంచి పలు వివరాలు సేకరించేందుకు నార్సింగి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి: Shilpa Chowdary Cheating Case : శిల్పాచౌదరి చేతిలో మోసపోయిన హీరో మహేశ్‌బాబు సోదరి
అంగీకరించిన కోర్టు
పెట్టుబడులు, అధిక వడ్డీల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో శిల్పా చౌదరిని ఉప్పర్‌పల్లి కోర్టు మరోసారి పోలీసు కస్టడీకి అనుమతించింది. దర్యాప్తులో పురోగతి కోసం కస్టడీకి అనుమతించాలని నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శిల్పపై ఉన్న కేసుల గురించి.. డబ్బులు వసూలు చేసిన వైనం గురించి తెలుసుకోవాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో... కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు శిల్పను నార్సింగి పోలీసులు ప్రశ్నించనున్నారు.
ఇదీ చదవండి: Shilpa Chowdary Cheating Case: శిల్పా చౌదరి కేసులో తెరమీదకు కొత్త పేర్లు
పక్కా ప్రణాళిక ప్రకారమే
శిల్ప పక్కా ప్రణాళిక ప్రకారమే అధిక వడ్డీలు ఆశ చూపి పలువురి వద్ద నుంచి డబ్బులు కొల్లగొట్టినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రియదర్శిని వద్ద నుంచి తీసుకున్న 2.90 కోట్ల రూపాయలకు శిల్ప చెల్లని చెక్కులు, నకిలీ బంగారు ఆభరణాలను ఇచ్చినట్టు ఫిర్యాదు చేశారు. చెక్కులను నగదుగా మార్చుకునేందుకు ప్రయత్నించిన సమయంలో అందుకు సంబంధించిన ఖాతా గతంలోనే రద్దయినట్టు బయటపడింది. అప్పుడు తాను మోసపోయినట్టు గ్రహించానని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారేటప్పుడు ఆదాయపు పన్ను శాఖ గుర్తించే ఆస్కారం ఉంది. ఈ కేసులో మాత్రం బ్యాంకు ద్వారా ఆర్థిక లావాదేవీలు జరగలేదని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల విచారణలో శిల్ప చెప్పినట్టు ఆస్పత్రి నిర్మాణం ఎక్కడ చేపట్టారు. ఎక్కడెక్కడ భూములు కొనుగోలు చేశారనే విషయంపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. విచారణకు హాజరయ్యే వారి నుంచి సేకరించిన వివరాల ద్వారా మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:Shilpa Chaudhary case: శిల్పా చౌదరిని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్