తెలంగాణ

telangana

ETV Bharat / crime

Naga Shourya farmhouse issue: చుట్టూ బాడీగార్డులు.. ప్రముఖులతో వాట్సాప్‌ గ్రూపులు - Naga Shourya farmhouse issue

హైదరాబాద్‌ నగర శివారుల్లోని మంచిరేవుల ఫాంహౌస్‌లో (Naga Shourya farmhouse) ఆదివారం రాత్రి పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే సహా బడా స్థిరాస్తి వ్యాపారులు, ఇతర రంగాల్లోని ప్రముఖులు ఉండటంతో ఈ వ్యవహారం సంచలనమైంది. పట్టుబడిన 30 మందిని నార్సింగి పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వీరి బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడంతోపాటు..ఈ నెల 15 వరకు రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

Naga Shourya farmhouse issue
Naga Shourya farmhouse issue: చుట్టూ బాడీగార్డులు.. ప్రముఖులతో వాట్సప్‌ గ్రూపులు

By

Published : Nov 2, 2021, 7:01 AM IST

Updated : Nov 2, 2021, 8:04 AM IST

రాజధాని శివారులోని మంచిరేవుల ఫాంహౌస్​ వ్యవహారంలో ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. టాలీవుడ్‌ యువ హీరో నాగశౌర్య తండ్రి.. నగర శివారుల్లోని మంచిరేవుల ఫాంహౌస్‌(Naga Shourya farmhouse)ను దాని యజమాని (ఓ మాజీ ఉన్నతాధికారి) నుంచి అయిదేళ్లకు అద్దెకు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మణికొండకు చెందిన గుత్తా సుమన్‌ కుమార్‌ ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో భాగంగా.. లీజు దస్తావేజులతో హాజరుకావాలని నాగ శౌర్య తండ్రికి పోలీసులు సూచించగా, ఆయన రాలేదు. ఈ నేపథ్యంలో సుమన్‌, నాగశౌర్యల మధ్య సంబంధాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు కేసు వివరాలు తెలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు..

విజయవాడకు చెందిన గుత్తా సుమన్‌కుమార్‌పై ఏపీ, తెలంగాణలోని వివిధ ఠాణాల్లో పలు కేసులు నమోదైనట్లు నార్సింగి పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ఆగస్టు 15న గచ్చిబౌలి ఠాణా పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పేకాట ఆడుతూ సైబరాబాద్‌ పోలీసులకు చిక్కినట్టు కూడా గుర్తించారు. ‘సుమన్‌కుమార్‌ చుట్టూ బాడీగార్డులను పెట్టుకుని ప్రముఖుడిగా చలామణి అవుతుంటాడు. పెద్దవాళ్లతో పరిచయం ఉందని చెబుతూ ఎందరినో మోసం చేశాడు. భూకబ్జాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించాం. మామిడి తోటల్లో పేకాట శిబిరాలు నిర్వహించే స్థాయి నుంచి ఫాంహౌజ్‌లు, స్టార్‌హోటళ్లు, అపార్ట్‌మెంట్లలో గదులను అద్దెకు తీసుకుని ప్రత్యేక క్యాంప్‌(క్యాసినో)లను ఏర్పాటుచేసే స్థాయికొచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులతో వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటుచేశాడు. స్థిరాస్తి వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు. ఓ న్యూస్‌ ఛానెల్‌కు డైరెక్టర్‌గానూ పనిచేశాడు. ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి భారీగా మోసాలకు పాల్పడ్డాడు’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు. మరో గంట వేచిఉంటే ఫాంహౌజ్‌లో పేకాట ఆడేందుకు మరికొందరు ప్రముఖులు వచ్చేవారన్నారు.

కీలకంగా ‘ఫోన్‌’లోని సమాచారం

ఈ కేసులో సుమన్‌ ఫోన్‌ కీలకంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులతో జరిపిన సంభాషణలు అందులో ఉన్నట్టు తెలుసుకున్న దర్యాప్తు అధికారులు వాటి కూపీ లాగుతున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించాలని నిర్ణయించిన నార్సింగి పోలీసులు మంగళవారం పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

అరెస్టయింది వీరే

గుత్తా సుమన్‌కుమార్‌, శ్రీరాం భద్రయ్య(మహబూబాబాద్‌ మాజీ ఎమ్మెల్యే), తనున్‌, గుమ్మాడి రామస్వామి చౌదరి, నందిగా ఉదయ్‌, సీహెచ్‌ శ్రీనివాస్‌రావు, టి.శివరామకృష్ణ, బడిగా సుబ్రహ్మణ్యం, పాండిటాగా సురేశ్‌, నాగార్జున, కె.వెంకటేశ్‌, ఎం.భానుప్రకాశ్‌, పాతూరి తిరుమల, వీర్లా శ్రీకాంత్‌, మద్దుల ప్రకాశ్‌, సీవీసీ రాజారాం, కె.మల్లికార్జునరెడ్డి, బొగ్గారాపూర్‌ నాగా, గట్ట వెంకటేశ్వరరావు, ఎస్‌ఎస్‌ఎన్‌ రాజు, యు.గోపాల్‌రావు, బి.రమేశ్‌కుమార్‌, కంపల్లి శ్రీనివాస్‌, ఇమ్రాన్‌ఖాన్‌, టి.రోహిత్‌, బొళ్లబోలా ఆదిత్య, సీహెచ్‌ గణేశ్‌, తోట ఆనంద్‌ కిశోర్‌, షేక్‌ ఖాదర్‌, బి.రాజేశ్వర్‌.

Last Updated : Nov 2, 2021, 8:04 AM IST

ABOUT THE AUTHOR

...view details