‘అన్ని విషయాల్లో మమ్ములను బలిపశువులను చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబీకులం. పంచాయతీకి పెట్టుబడి ఎక్కడి నుంచి తేగలం? ట్రాక్టర్‌కు డీజిల్ కూడా మేమే పోయించాలి. సర్పంచికి బాధ్యత లేదా? ఇది ఉద్యోగమా..బానిస బతుకా సార్? కార్యదర్శుల పని తీరువల్లే అనేక విషయాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. అయినా మాకు గుర్తింపు లేదు. కష్టపడి ఉన్నత చదువులు చదివితే ఏదో ఒక ఉద్యోగం వచ్చిందనుకుంటే చదువురాని కొందరి తీరుతో ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి’’ అని లేఖ రాసి ఓ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు యత్నించారు.
పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం.. వారే కారణమంటూ లేఖ! - నారాయణపురం పంచాయతీ కార్యదర్శి
Panchayat Secretary Suicide Attempt: కష్టపడి ఉన్నత చదువులు చదివితే ఏదో ఒక ఉద్యోగం వచ్చిందనుకుంటే.. చదువురాని కొందరి తీరుతో ఇబ్బంది పడుతున్నామని.. ఇది ఉద్యోగమో.. బానిస బతుకో తెలియట్లేదంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని ఇర్సులాపురంలో చోటు చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం పాత ఇర్సులాపురానికి చెందిన వెంకటేశ్ నారాయణపురం పంచాయతీ కార్యదర్శిగా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు. సర్పంచి, ఉపసర్పంచి సహకరించడం లేదంటూ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పేరిట లేఖ రాసి శుక్రవారం ఇంట్లో పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబసభ్యులు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్ శశాంక, బయ్యారం ఎంపీడీవో చలపతిరావు, మరికొందరు అధికారులు ఆసుపత్రిలో వెంకటేశ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంకటేశ్‌ను హైదరాబాద్‌కు తరలించారు.
ఇదీ చూడండి:Sexual harassment in AP : మతం ముసుగులో లైంగిక వేధింపులు