Nampally Girl Missing Case : హైదరాబాద్ నిలోఫర్‌లో కిడ్నాప్‌కు గురైన చిన్నారి కథ సుఖాంతం అయింది. గంటల వ్యవధిలోనే ఈ కేసును నాంపల్లి పోలీసులు ఛేదించారు. కల్లు కాంపౌండ్‌లో ఉన్న నిందితురాలిని అదుపులోకి తీసుకొని... చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
ఏం జరిగింది?
Baby Missing Case : చిన్నారి కిడ్నాప్ కేసును నాంపల్లి పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. రంగారెడ్డి జిల్లా బొబ్బిలిగం గ్రామానికి చెందిన మాధవి తన కుమార్తె యువికతో కలిసి నీలోఫర్ ఆస్పత్రికి బుధవారం వచ్చింది. వైద్య పరీక్షలు చేయించుకొని.. రిపోర్టుల కోసం వెళ్లగా... కుమార్తె కనిపించకుండా పోయింది. చిన్నారి అదృశ్యంతో ఆందోళనకు గురైన తల్లి... వెంటనే నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న నాంపల్లి పోలీసులు... సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు.
ఎలా పట్టుకున్నారు?
Missing Case updates: సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పాపను గంటల వ్యవధిలోనే సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కిడ్నాప్ చేసిన మహిళ... హాస్పిటల్ ముందు ఆటో ఎక్కడాన్ని గుర్తించామని... ఆటో నంబర్ ఆధారంగా ఆటో డ్రైవర్‌ను మాసాబ్ ట్యాంక్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతడిని విచారించగా... పాపను కిడ్నాప్ చేసిన శ్రీదేవి అనే మహిళను పట్టుకున్నామన్నారు. హాబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమటి కుంట కల్లు కాంపౌండ్ వద్ద అదుపులోకి తీసుకొని... పాపను తల్లి వద్దకు చేర్చినట్లు వివరించారు.