పిల్లలను అపహరించి గుట్టుగా అమ్ముకుందామనుకున్న ఓ ముఠా ప్రయత్నాలను ఏపీలోని గుంటూరు అర్బన్ పోలీసులు భగ్నం చేశారు. ఈనెల 24న గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు యానాది కాలనీలో రెండేళ్ల బాలుడు జీవా.. అపహరణకు గురయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు ఒక్కసారిగా అదృశ్యమయ్యేసరికి తల్లి బాలకు అనుమానం వచ్చింది. అంతకు ముందు కారు ఆపి... తనను నీళ్లు కావాలని అడిగినవారే.. ఆ పని చేశారని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
బాలుడి అపహరణ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు.... కారుతోపాటు ఇతర సాంకేతిక సాక్ష్యాధారాలను సేకరించి ముఠా ఆట కట్టించారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్‌కు చెందిన అనిశెట్టి సువర్ణ, అనిశెట్టి దుర్గా ప్రసాద్, అమరాలపూడి శ్రీనివాసరావు, పోకూరి సాగర్, కడప పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన వరదా చంద్రిక ప్రతిభా భారతి అలియాస్ చంద్రిక, విశాఖపట్నం అక్కయ్యపాలెంలో ఉంటున్న తూర్పుగోదావరి జిల్లా బంగారయ్యపేటకు చెందిన దుర్గాడ వేణును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు వర్మ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నిందితుల నుంచి రూ.1,20,000 నగదు, 10 లక్షలు విలువచేసే కారు, చరవాణిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.